రాష్ట్రాల హక్కులను మోదీ హరిస్తున్నారు: తమిళనాడు సీఎం
నిధుల పొందడం రాష్ట్రాల హక్కు అని వ్యాఖ్యానించిన స్టాలిన్;
Translated by : Praveen Chepyala
Update: 2025-04-18 11:29 GMT
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తమిళనాడు హక్కులు, స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ - అమిత్ షా ద్వయానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
త్రిభాషా విధానం, లోక్ సభ స్థానాల డీలిమిటేషన్, నీట్ నుంచి మినహాయింపు వంటి అంశాలపై డీఎంకే, బీజేపీ మధ్య విభేదాలు ఉన్నాయి.
తిరువళ్లూవర్ లో జరిగిన ప్రభుత్వ కార్యాక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి.. అమిత్ షా పై విమర్శలు గుప్పించారు. నీట్ మినహాయింపులు, హిందీ భాష రుద్దడం, తమిళనాడు కు ప్రత్యేక నిధులు, పార్లమెంటరీ సీట్ల పెంపు వంటి అంశాలపై తమిళనాడుకు హమీలు ఇవ్వాలని ఆయన కేంద్ర హోంమంత్రికి సవాల్ విసిరారు.
‘‘కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నేను కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను. నీట్ నుంచి మాకు మినహాయింపు ఇస్తామని ఆయన హమీ ఇవ్వగలరా? హిందీని విధించబోనని ఆయన హమీ ఇవ్వగలరా? తమిళనాడుకు ప్రత్యేక నిధుల విడుదలను ఆయన జాబితా చేయగలరా? డీలిమిటేషన్ వల్ల పార్లమెంటరీ ఎన్నికల్లో తమిళనాడు సీట్లు తగ్గవని మీరు మాట ఇవ్వగలరా? అని స్టాలిన్ ప్రశ్నించారు.
రాష్ట్ర అభివృద్ది కార్యక్రమాలను హైలైట్ చేయడానికి నిర్వహించిన ఈ కార్యక్రమం. క్రమంగా ఢిల్లీకి వ్యతిరేకంగా ప్రజలను తిప్పడానికి ఉపయోగించుకున్నారు. తమిళనాడు వైఖరిని పునరుద్ఘాటించడానికి, ద్రవిడ నమూనాను హైలైట్ చేయడానికి స్టాలిన్ ఒక వేదికగా ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు.
మోదీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం..
ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. డీఎంకే పై విమర్శలు గుప్పించారు. కేంద్రం నుంచి తమిళనాడుకు తగినన్ని నిధులు కేటాయిస్తూనే ఉన్నప్పటికీ కొందరు ఎప్పటికీ ఏడుస్తూనే ఉన్నారని ఆరోపించారు. ఆయన ఇటీవల రామేశ్వరంలోని ప్రతిష్టాత్మక పంబన్ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా తమిళనాడులో పర్యటించారు.
నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ నిధులు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారని స్టాలిన్ అన్నారు. అప్పట్లో రాష్ట్రాలు బిచ్చగాళ్లు కాదని అన్నారని గుర్తు చేశారు. ‘‘ మా డిమాండ్లను ఏడుపు అని పిలవడం ఎలా న్యాయమైంది? నేను ఏడవడం లేదు.. ఇది తమిళనాడు హక్కు’’ అని స్టాలిన్ అన్నారు.
నిరాకరిస్తున్నారు..
ప్రధానమంత్రి అయిన తరువాత రాష్ట్రాల పై తిరస్కార వైఖరిని మోదీ అవలంబిస్తున్నారని డీఎంకే అధినేత ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనే రాష్ట్రాల హక్కులను సమర్థించారని చెప్పారు. ‘‘రాష్ట్రాలకు ఎక్కువ న్యాయం ఉంటే.. మన ప్రజలకు ఇంకా ఎక్కువ చేయగలం’’ అని స్టాలిన్ అన్నారు.
ద్రవిడ నమూనాను సమర్థిస్తూ మాట్లాడిన ఆయన.. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రత్యర్థి పార్టీలలో ఫిరాయింపులను ప్రొత్సహిస్తోందని స్టాలిన్ ఆరోపించారు.
అయితే ఇలాంటి వ్యూహాలు తమిళనాడులో విజయవంతం కావని ఆయన చెప్పారు. అన్నాడీఎంకే- బీజేపీ కూటమిపై సైతం విమర్శలు చేస్తూ.. తమిళనాడులో ఎన్ని కూటమిలు వచ్చినా డీఎంకే ఎదుర్కోవడానికి సిద్దంగా ఉందని అన్నారు.
మేము కేవలం తమిళనాడు హక్కుల కోసమే పోరాడటం లేదని, అన్ని రాష్ట్రాల హక్కుల కోసం కొట్లాడుతున్నామని ఈ సందర్భంగా స్టాలిన్ నొక్కి చెప్పారు.