TVK చీఫ్ విజయ్ కరూర్ పర్యటన వాయిదా.. కారణమేంటి?
దర్యాప్తులో భాగంగా రెండు రోజుల పాటు విచారించేందుకు కరూర్ చేరుకున్న సీబీఐ టీం..
తమిళగ వెట్రి కజగం(TVK) చీఫ్ విజయ్(Vijay) ఈరోజు (శుక్రవారం, అక్టోబర్ 17) కరూర్ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. సెప్టెంబర్ 27న తన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట(Stampede)లో మృతుల బంధువులను ఆయన పరామర్శించాల్సి ఉంది.
41 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనపై సుప్రీంకోర్టు కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించింది. దాంతో టీం సభ్యులు ఈ రోజు (అక్టోబర్ 17) కరూర్ జిల్లాకు చేరుకోవడంతో విజయ్ తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం.
రిటైర్డ్ జడ్జి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సీబీఐ దర్యాప్తునకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన సీబీఐ అదనపు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముఖేష్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రామకృష్ణన్‌తో కలిసి ఈ రోజు ఉదయం కరూర్ చేరుకున్నారు. సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేయనున్నారు. భద్రతా ఫుటేజ్ సహా, రద్దీ నియంత్రణలో వైఫల్యాలు, తమిళనాడు పోలీసులు మంజూరు చేసిన అనుమతులను పరిశీలించనున్నారు.
మృతుల కుటుంబాలను ఓదార్చడానికి విజయ్ కరూర్‌లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు. తన పర్యటనకు పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. అయితే కరూర్‌కు సీబీఐ టీం చేరుకోవడంతో గురువారం రాత్రి విజయ్ తన పర్యటన రద్దు చేసుకున్నట్లు పార్టీ నాయకులు ధృవీకరించారు.
"సీబీఐ బృందం నేడు, రేపు కరూర్‌లో పర్యటిస్తుంది. వారి పర్యటనలో ఎలాంటి అంతరాయాలు కలిగించకూడదనుకున్నాం. నిష్పాక్షిక దర్యాప్తు కోరుకుంటున్నాం. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నాం," అని పేరు చెప్పడానికి ఇష్టపడని టీవీకే సీనియర్ నిర్వాహకుడొకరు చెప్పారు.