జల్లికట్టులో ఏడుగురు మృతి, పదుల సంఖ్యలో గాయపడిన ప్రేక్షకులు
పోటీదారుల కంటే ఎక్కువ సంఖ్యలో మృతి చెందిన ప్రేక్షకులు, రెండు చోట్ల మూగ జీవాలు కూడా..;
By : Praveen Chepyala
Update: 2025-01-17 09:00 GMT
తమిళనాడులో కనుమ పండగ రోజు నిర్వహించే సాంప్రదాయ జల్లికట్టు, మంజు విరాట్టు పోటీలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ఇందులో ప్రధానంగా పోటీదారులు కాకుండా ఎక్కువగా చూడటానికి వచ్చిన వీక్షకులే ఉన్నారు. అలాగే ఓ ఎద్దుల యజమాని సైతం మృతి చెందారు. అలాగే రెండు వేర్వేరు ఘటనల్లో రెండు ఎద్దులు సైతం మృతి చెందాయి. పుదుక్కోట్టైలో ఓ ఎద్దు మృతి చెందగా, శివగంగలోని సిరవాయల్ ఓ ఎద్దుతో పాటు దాని యజమాని సైతం మరణించినట్లు పోలీసులు తెలిపారు.
మంజువిరాట్టు..
శివగంగ జిల్లా సిరవాయల్ లోని మంజువిరాట్టు వద్ద కార్యక్రమాన్ని పాల్గొనేందుకు వచ్చిన నడువి కొట్టై కీల అవంధిపట్టి గ్రామానికి చెందిన థనీష్ రాజా తన ఎద్దును పోటీ జరుగుతున్న ప్రదేశానికి తీసుకొచ్చారు. అయితే ఎద్దు భయపడి పారిపోతుండగా దాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇద్దరు బావిలో పడి మృతి చెందారు.
ఇందులో 150 పోటీదారులు, 250 ఎద్దులతో కుస్తీ పట్టగా దాదాపు 130 మంది గాయపడ్డారు. అలాగే పోటీలు చూడానికి వచ్చిన ప్రేక్షకుడు సుబ్బయ్యను ఎద్దును పొడవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
ఇతర జిల్లాల్లో..
మదురై లోని అలంగనల్లూర్ లో వడిపట్టి సమీపంలోని మెట్టుపట్టి గ్రామానికి చెందిన 55 ఏళ్ల ప్రేక్షకుడు పి. పెరియసామి మెడపై ఎద్దు పొడవడంతో మృతి చెందాడు. ఈ పోటీల్లో దాదాపుగా 70 మంది ప్రేక్షకులు సైతం గాయపడ్డారు. వీరందరిని ఆస్పత్రికి తరలించారు.
తిరుచిరాపల్లి, కరూర్, పుదుకొట్టై జిల్లాలో జరిగిన నాలుగు వేర్వేరు పోటీల్లో ఇద్దరు ప్రేక్షకులు మరణించారు. ఎద్దుల యజమానులతో సహ 148 మంది వ్యక్తులు సైతం గాయపడ్డారు. కరూర్ జిల్లా కుజుమని సమీపంలో జరిగిన పోటీల్లో కులంతైవేలు అనే ప్రేక్షకుడు మరణించారు. మహాదేవ పట్టి జల్లికట్టులో 607 ఎద్దులు, 300 మంది పోటీదారులు పాల్గొన్నారు. ఇందులో పదిమంది ప్రేక్షకులు గాయపడ్డారు.
వన్నియన్ ప్రాంతంలో జరిగిన జల్లికట్టులో 19 మంది ప్రేక్షకులు గాయపడ్డారు. కృష్ణ గిరిలో నిర్వహించిన ఎద్దుల పందెం పోటీలో 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా, సెలం జిల్లా సెంతారాపట్టిలో ఎద్దు దాడి చేయడంతో 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.