కేరళ: తిరువనంతపురంలో బీజేపీకి గడ్డు పరిస్థితి..

ప్రతిపక్ష పార్టీలకు ప్రచార అస్త్రంగా మారిన కాషాయ పార్టీ కార్యకర్తల ఆత్మహత్యలు

Update: 2025-11-16 09:28 GMT
ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కౌన్సిలర్ అనిల్ కుమార్, కార్యకర్త ఆనంద్ కె తంబి, మరో కార్యకర్త అనంతు అజి (ఫైల్)
Click the Play button to listen to article

కేరళ(Kerala) రాష్ట్రం తిరువనంతపురం(Thiruvananthapuram)లో భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తల వరుస ఆత్మహత్యలు పార్టీని సంక్షోభంలో పడేశాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరిగిన ఈ బలవన్మరణాలు ప్రతిపక్ష పార్టీలకు ప్రచారాస్త్రంగా మారాయి.

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ పరిధిలోని త్రిక్కన్నపురం వార్డు నుంచి పోటీ చేయాలనుకున్నాడు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా ఉన్న ఆనంద్ కె తంబి ఇతను శనివారం (నవంబర్ 15) సాయంత్రం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణాలకు దారితీసిన పరిస్థితులను సూసైట్ నోట్‌లో రాశాడు.

‘‘నేను త్రిక్కన్నపురం వార్డు నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేయాలనుకున్నా..అయితే స్థానికంగా ఆధిపత్యం చెలాయించే ఒక వర్గం మరో అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. పార్టీ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనుకున్నా. కాని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తల నుంచి నాకు బెదిరింపులు వచ్చాయి. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జీవించడం. అదే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. నా మృతదేహాన్ని బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ నాయకులకు చూపించొద్దు. మీకు వీలైన చోట దాన్ని పూడ్చిపెట్టండి" అని నోట్‌లో రాసి ఉంది.

కె తంబి ఆనంద్ సూసైట్ నోట్ రాజకీయ ప్రత్యర్థులకు అవకాశంగా మారింది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కేడర్‌ను పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని జనంలో చెబుతున్నారు. మరోవైపు.. బీజేపీ సీనియర్ నాయకులు ఈ పరిణామాలకు అడ్డుకట్ట వేసే పనిలో ఉన్నారు.


బీజేపీ కౌన్సిలర్ మరణం..

సెప్టెంబర్ చివరలో బీజేపీకి చెందిన తిరుమల వార్డు కౌన్సిలర్, నగర యూనిట్‌ సీనియర్ ఆఫీస్ బేరర్ కె అనిల్ కుమార్ వార్డు కౌన్సిల్ కార్యాలయంలో చనిపోయి కనిపించాడు. అతని సూసైడ్ నోట్‌లో ‘‘నేను నడుపుతున్న సహకార సంస్థ నుంచి రుణాలు తీసుకున్న కొంతమంది ‘‘సొంత మనుషులు’’ తిరిగి చెల్లించడం లేదని, ఈ విషయంలో నాయకత్వం నుంచి నాకు మద్దతు కూడా లేదు’’ అని రాసి ఉంది.


లైంగిక వేధింపులతో ఆత్మహత్య..

26 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్, మాజీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అనంతు అజి కొన్ని వారాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. బలవన్మరణానికి ముందు ఇన్‌స్టాలో అనంతు షేర్ చేసిన పోస్టు దుమారం రేపింది. ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరంలో ఆర్ఎస్ఎస్ నాయకుడొకరు తనను లైంగికంగా వేధిస్తున్నాడని అందులో పేర్కొన్నారు.

ఈ ముగ్గురు ఆత్మహత్యల వెనక వేర్వేరు కారణాలున్నాయి. జరిగింది మాత్రం తిరువనంతపురంలోనే. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని బీజేపీ నేతలు భావిస్తోన్న తరుణంలో.. కాషాయ పార్టీలో కార్యకర్తలకు భరోసా లేదని ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తూ ఈ మూడు ఘటనలు తెరమీదకు తెస్తున్నాయి.

(ఆత్మహత్యలను నివారించవచ్చు. సహాయం కోసం దయచేసి ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్‌లకు కాల్ చేయండి: నేహా ఆత్మహత్య నివారణ కేంద్రం – 044-24640050; ఆత్మహత్య నివారణ, భావోద్వేగ మద్దతు & గాయం సహాయం కోసం ఆసరా హెల్ప్‌లైన్ — +91-9820466726; కిరణ్, మానసిక ఆరోగ్య పునరావాసం — 1800-599-0019, దిశ 0471- 2552056, మైత్రి 0484 2540530, మరియు స్నేహ ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్ 044-24640050.)

Tags:    

Similar News