Maternal deaths | కలుషిత ఐవీ (IV) ప్లూయిడ్‌తో నలుగురు బాలింతలు మృతి

బళ్లారి జిల్లా ఆసుపత్రిలో నలుగురు బాలింతలు మృత్యువాతపడ్డారు. కలుషిత IV ప్లూయిడ్ ఎక్కించడం వల్ల వీరు ప్రాణాలొదిలారు.

Update: 2024-12-06 09:38 GMT

కర్ణాటకలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో 15 రోజుల వ్యవధిలో నలుగురు బాలింతలు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కుదిపేస్తుంది.

ఎలా బయటపడింది?

బళ్లారి జిల్లా ఆసుపత్రిలో నవంబర్ 9 నుంచి 11వ తేదీల మధ్య 34 సిజేరియన్లు జరిగాయి. వీరిలో ఏడుగురికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. నవంబర్ 11వ తేదీ రాత్రి ఒక ఒకరు, నవంబర్ 12 తెల్లవారుజామున మరొకరు మరణించారు. మరో ఐదుగురిని మెరుగైన వైద్యం కోసం బళ్లారి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (గతంలో VIMS)కి తరలించారు. ఈ ఘటనపై త్రిసభ్య వైద్య కమిటీ నవంబర్ 14న విచారణ జరిపింది ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అదే రోజు విమ్స్‌లో మరో మహిళ మరణించింది. నవంబర్ 25న ఇంకో మహిళ చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. అనుమానిత IV ఫ్లూయిడ్ వినియోగమే మరణాలకు కారణమయ్యాయని దర్యాప్తు బృందం నిర్ధారించింది. కుడ్లిగి తాలూకా గూడేకోటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన మహాలక్ష్మి నవంబర్ 24న విమ్స్‌లో చేరి చికిత్స పొందుతూ 26న మృతి చెందింది. అయితే ఈమె మరణానికి, అనుమానిత IV ఫ్లూయిడ్‌కు ఏదైనా సంబంధం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

నిర్లక్ష్యమే ప్రాణాలు తీసిందా?

ఐదుగురు బాలింతల మృతికి ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం, మందుల నాణ్యత పర్యవేక్షణ లోపమే కారణంగా కనిపిస్తుంది. రింగర్స్ లాక్టేట్ సొల్యూషన్‌ను సాధారణంగా డీహైడ్రేషన్ సమయంలో ఎక్కిస్తారు. ఇందులో ఉంటే నీరు, గ్లూకోజ్, పొటాషియం, సోడియం, క్లోరైడ్ శరీరానికి సత్తువనిస్తాయి. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా పశ్చిమ బంగా ఫార్మా కంపెనీకి చెందిన IV ఫ్లూయిడ్‌ వాడకాన్ని కర్ణాటకలో నిషేధించారు. ఈ కంపెనీ 192 బ్యాచ్‌ల రింగర్స్ లాక్టేట్ IV ఫ్లూయిడ్‌లను సరఫరా చేసింది. నాణ్యత లేని కారణంగా 22 బ్యాచ్ IV ఫ్లూయిడ్‌‌ వాడవద్దని వైద్యశాఖ అన్ని ఆసుపత్రులకు సర్కులర్ జారీ చేసింది. ఇదే బ్యాచ్‌కు చెందిన IV ఫ్లూయిడ్‌ బాటిల్స్ బళ్లారి జిల్లా ఆసుపత్రికి చేరడంతో వాటిని వినియోగించారు.

ఫంగస్, బ్యాక్టీరియ ఉన్నట్లు నిర్ధారణ..

పశ్చిమ్ బంగా ఫార్మా కంపెనీ సప్లై చేసిన IV ఫ్లూయిడ్ బాటిల్స్‌లో ఫంగస్, బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్దారణ అయ్యిందని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఫెడరల్‌కి తెలిపింది. రాష్ట్ర ప్రయోగశాలలో ఈ విషయం బయటపడిందని, మరోసారి నిర్ధారించుకునేందుకు కొన్ని శాంపిల్స్‌ను కోల్‌కతాలోని సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీకి పంపారు. డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందుతుందని వైద్యాధికారులు భావిస్తున్నారు.

నష్ట నివారణ చర్యలు..

పశ్చిమ్ బంగా ఫార్మా కంపెనీని కర్ణాటక ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. డ్రగ్స్ కంట్రోలర్ కె ఉమేష్‌ను సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో ఆహార శాఖ కమిషనర్‌, ఐఏఎస్‌ అధికారి కె శ్రీనివాస్‌ నియమించింది. పశ్చిమ్ బంగా కంపెనీ ఫ్లూయిడ్ల వినియోగాన్ని కర్ణాటక అంతటా నిలిపివేసింది. లోకాయుక్త ఎస్పీ హనుమంతరాయ్ నేతృత్వంలోని బృందం.. బెలగావి జిల్లా ఆసుపత్రి గోడౌన్‌లో ఆ కంపెనీ సప్లై చేసిన IV ఫ్లూయిడ్ బాక్సులను పరిశీలించింది. ఏప్రిల్ నుంచి బెలగావి జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఇక్కడి నుంచే IV ఫ్లూయిడ్ బ్యాక్సులను పంపించారు.

ప్రతిపక్షాల దాడి..

బళ్లారి ఆసుపత్రుల్లో నలుగురు బాలింతలు మృతి చెందడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ నాయకుడు ఆర్ అశోక్ ఆరోపించారు. వైద్యారోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యమే బాలింతల ప్రాణాలను బలిగొందని చెప్పారు.

మరణాలను దాచారు..

కలుషిత IV ఫ్లూయిడ్‌ కారణంగా మరణించిన వారి వివరాలు బయటకు పొక్కకుండా సిద్ధరామయ్య ప్రభుత్వం దాచిపెట్టిందని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నవంబర్ 30న ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించి, రాష్ట్రవ్యాప్తంగా విచారణ ప్రారంభించి, ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి డబ్బు రికవరీ చేయాలని ఆదేశించారు.  

Tags:    

Similar News