ఓసి నీ అఘాయిత్యం కూలా, ఇదేం పనే తల్లీ!
ప్రేమ కోసమై 'బాంబు'లా మారిన మహిళా ఇంజినీర్ రెని జోషిల్డా
By : The Federal
Update: 2025-11-07 06:01 GMT
'పాతాళ భైరవి' సినిమాలో 'ప్రేమ కోసమై వలలో పడేనే'.. అనే పాట గుర్తుందా.. ఉండే ఉంటుందిలే.. ఇప్పుడు అచ్చంగా అలాంటిదే బెంగళూరులో జరిగింది. ఓ మహిళా ఇంజినీర్ ప్రేమ విఫలమైందని పలు రాష్ట్రాల్లోని స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపి కటకటాల పాలైంది. ఆమె పేరు రెనీ జోషిల్డా.
ప్రేమలో పడటం తప్పు కాదు — కానీ, ప్రేమలో పడి పిచ్చిగా మారి, ప్రపంచాన్నే బెదిరించడమా? ఇదే ప్రశ్న ఇప్పుడు బెంగళూరు నగరాన్ని, దేశంలోని అనేక రాష్ట్రాలను కుదిపేస్తోంది. కొంత కాలంగా జరుగుతున్న ఈ ఫేక్ బాంబు బెదిరింపులకు పోలీసులు ఎట్టకేలకు ముగింపు పలికారు.
30 ఏళ్ల రెనీ జోషిల్డా బెంగళూరులో ఒక బహుళజాతి సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేది. తెలివితేటలున్న యువతే. ప్రేమలో మునిగిపోయింది. తన సహోద్యోగిపై ప్రేమాభిమానాలు పెంచుకుంది. కానీ ఆ యువకుడు ఆమెను తిరస్కరించాడు. మరొకరిని వివాహం చేసుకున్నాడు.
ఆ తిరస్కారాన్ని తట్టుకోలేకపోయిన జోషిల్డా, “నా ప్రేమను నువ్వు తిరస్కరించావు, నేను నీ జీవితాన్ని కుదిపేస్తా” అన్నట్టుగా, ప్రతీకార మార్గాన్ని ఎంచుకుంది. తన సహోద్యోగి పేరుతో, అతని ఇమెయిల్, ఆన్‌లైన్ అకౌంట్లను ఉపయోగించి దేశవ్యాప్తంగా తప్పుడు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపింది.
తన మాజీ సహోద్యోగి మీద పోలీసు కేసులు పడేలా చేయడం ఆమె ఉద్దేశమే అయినా జనాన్ని ఇబ్బందుల పాల్జేయడంతో కటకటాల పాలైంది.
ఆమె పథకం సినిమా కథను తలపిస్తుంది. తన గుర్తింపును దాయడం కోసం VPN (Virtual Private Network) వాడింది. ‘గేట్ కోడ్’ అనే యాప్ ద్వారా వర్చువల్ మొబైల్ నంబర్లు తెచ్చుకుంది. ఆ నంబర్లతో పలు నకిలీ వాట్సాప్ అకౌంట్లు సృష్టించింది. ఆ ఖాతాల ద్వారానే బెదిరింపు మెయిల్స్ పంపింది.
మెయిల్స్ వెనుక ఒక మానవ రూపం ఉండదనుకున్న పోలీసులు మొదట గందరగోళానికి గురయ్యారు. కానీ ఆ వర్చువల్ గోడల వెనుక దాగి ఉన్న నిజమైన వ్యక్తి రెనే జోషిల్డా అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.
బెదిరింపు మెయిల్స్ తో హడలెత్తించిన జోషిల్డా..
చెన్నై లో జోషిల్డాను అరెస్ట్ చేశారు. గుజరాత్ హైకోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ పంపిన కేసు ఆమెపై నమోదైంది. మూడు బాంబులు హైకోర్టు భవనంలో ఉంచినట్లు ఆమె మెయిల్‌లో రాసింది.
ఆ ఇమెయిల్ చూసి కంగారుపడిన పోలీసులు, బాంబుల్ని నిర్వీర్యం చేసే దళం ఆ భవనాన్ని గాలించి చివరికి ఏమీ లేదని తేల్చారు. ఆ సంఘటన దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది.
ఆ తర్వాత ఇలాంటి మెయిల్స్ హైదరాబాద్, గుజరాత్, అహ్మదాబాద్, రాజ్‌కోట్, చెన్నై కోర్టులకు, చివరకు గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వరకు వెళ్లాయి.
“గుజరాత్ విమాన ప్రమాదంలాగా మీ స్కూళ్లను పేల్చేస్తాను” అని ఆమె రాసిన వాఖ్యాలు మనసు విరిగిపోయిన ఓ మహిళ రాసిన పంక్తులే అయినా, దేశ భద్రతా యంత్రాంగానికే కంగారు పుట్టించాయి.
ప్రేమ విఫలమైందనే క్షోభతో రెనీ జోషిల్డా ప్రపంచాన్నే కలవరపెట్టాలని చూసింది. ప్రేమను తిరస్కరించిన ఆ వ్యక్తిని శిక్షించాలనే తపనతో, ఆమె అంధకారంలోకి జారుకుంది.
బెంగళూరులోని స్కూళ్లకు బాంబు బెదిరింపు కేసుల్లో కూడా ఆమె పాత్ర బయటపడింది. చివరకు పోలీసులు ఆమెను చెన్నై నుంచి బాడీ వారెంట్ మీద బెంగళూరుకు తీసుకువచ్చి విచారణ మొదలుపెట్టారు.
ఒక ప్రతిభావంతురాలు, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్- ప్రేమలో ఓడిపోయి బాంబు బెదిరింపు నేరస్థురాలిగా మారడం ఎంత వింతగా అనిపిస్తుందో!
ప్రేమలోని ఆవేశం, నిరాశ, ప్రతీకారం- ఇవన్నీ కలిసి ఒక మనసును నాశనం చేశాయి. ప్రేమలో ఓటమి అంటే జీవితమంతా ఓటమేనా? జోషిల్డా అంటూ ఆమె సహచరులు ముక్కున వేలేసుకుంటున్నారు.