కర్ణాటకలో బైక్ టాక్సీ నిలిపివేతకు కారణమేంటి?
మోటార్ వెహికల్ యాక్టు ప్రకారం ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు వచ్చే వరకు 6 వారాల పాటు బైక్ టాక్సీ సేవలను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చిన కోర్టు.;
కర్ణాటక(Karnataka)లో బైక్ టాక్సీ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆరు వారాల పాటు సేవలు నిలిపివేయాలని హైకోర్టు (High court) జస్టిస్ బిఎం శ్యామ్ ప్రసాద్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ లోగా మోటార్ వెహికల్ యాక్టు కింద సరైన మార్గదర్శకాలు సూచించాలని కూడా సూచించింది.
2016 నుంచి బైక్ టాక్సీ సేవలు..
రాపిడో(Rapido) మాతృ సంస్థ - రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ లిమిటెడ్ 2016లో కర్ణాటకలో బైక్ టాక్సీ సేవలను ప్రారంభించింది. సరసమైన ధర, వేగవంతమైన రవాణా కారణంగా ప్రజాదరణ లభించింది. అయితే కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ ఈ తరహా సేవలు చట్టవిరుద్ధమని పేర్కొంది. మోటారు వెహికల్ యాక్టు ప్రకారం తెల్ల నంబర్ ప్లేట్లు (ప్రైవేట్ వాహనాలు) గల ద్విచక్ర వాహనాలను వాణిజ్య ప్రయోజనాలకు వాడకూడదని చెబుతోంది.
హైకోర్టును ఆశ్రయించిన రాపిడో..
మరోవైపు బైక్ ట్యాక్సీ సేవల వల్ల తాము జీవనోపాధి కోల్పోవాల్సి వస్తోందని ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఫిర్యాదు చేయడంతో రవాణా శాఖ ఫిబ్రవరి 2019లో సుమారు 200 బైక్‌లను, జనవరి 2022లో 120 బైక్‌లను స్వాధీనం చేసుకుంది. ఈ చర్యతో రాపిడో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకుని బైక్‌లను కూడా రవాణా వాహనాలుగా పరిగణించాలని కోరింది. రాపిడో అభ్యర్థన మేరకు రవాణా శాఖ చర్యలు తీసుకోకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సేవలను ఉపసంహరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం..
జూలై 2021లో రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ పథకాన్ని ప్రవేశపెట్టి చట్టబద్ధం చేసింది. ఈ సేవలను ఎలక్ట్రిక్ వాహనాలకే (EVలు) పరిమితం చేసింది. మహిళల భద్రతకు సంబంధించిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2024లో ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సేవల పథకాన్ని ఉపసంహరించుకుంది.
డ్రైవర్ల మధ్య గొడవలు..
టాక్సీ సేవల విషయంలో ఆటోరిక్షా డ్రైవర్లు, బైక్ టాక్సీ రైడర్లకు మధ్య తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2024లో బైక్ టాక్సీ వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. బైక్ టాక్సీ ఆపరేటర్లకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నిబంధనలకు విరుద్ధమంటున్న ప్రభుత్వం..
రాపిడో వారానికి 20 లక్షలకు పైగా రైడ్లు బుక్ అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చూపుతోంది. బైక్ టాక్సీ సేవలు భద్రతా నిబంధనలను విరుద్ధమని కోర్టుకు విన్నవించింది. మరి కోర్టు బైక్ రైడర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. కర్ణాటకతో పాటు, మహారాష్ట్ర, ఢిల్లీ, అస్సాం రాష్ట్రాల్లో కూడా రాపిడో చట్టపర సవాళ్లను ఎదుర్కొంటోంది.