DRUGS | డ్రగ్స్ కేసులో నటి హేమకు కర్నాటక హైకోర్టు ఊరట

డ్రగ్స్ కేసులో పట్టుబడిన నటి హేమకు కర్నాటక హైకోర్టు ఊరట కల్పించింది. డ్రగ్స్ కేసు (Drugs Case)లో ఆమెపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది.;

Update: 2025-01-02 09:01 GMT
రేవ్ పార్టీ.. డ్రగ్స్ కేసులో పట్టుబడిన తెలుగు నటి హేమకు కర్నాటక హైకోర్టు ఊరట కల్పించింది. డ్రగ్స్ కేసు (Drugs Case)లో ఆమెపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది. గత ఏడాది మే నెలలో బెంగళూరులో రేవ్ పార్టీ జరిగింది. దీనిపై పోలీసులు దాడి చేసి పలువుర్ని పట్టుకున్నారు. మరికొందర్ని అనుమానితులుగా గుర్తించారు. ఆ పార్టీలో తాను లేనని, అయినా తనపై దుష్ర్పచారం చేస్తున్నారంటూ నటి హేమ వాదించారు. ఆ తర్వాత నిర్వహించిన డ్రగ్స్ వాడారా లేదా అనే దాన్ని గుర్తించేందుకు పరీక్ష నిర్వహించారు. నటి హేమకి పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు చెప్పారు. ఎన్‌డిపిఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 27(బి) కింద శిక్షార్హమైన నేరాల కోసం పిటిషనర్‌పై ఛార్జిషీట్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఆమె కోర్టును ఆశ్రయించారు. తాను డ్రగ్స్ సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని హేమ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణపై స్టే కోరుతూ హేమ దాఖలు చేసిన ఇంటర్‌లోక్యూటరీ అప్లికేషన్ (ఐఎ)ను అనుమతిస్తూ విచారణ జరిపిన న్యాయస్థానం స్టే ఇచ్చింది.
కృష్ణవేణిగా పేరు మార్చుకుని వెళ్లారా...
బెంగళూరులో రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ ఆవేళ డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో నటి హేమతో పాటు ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసుతో పాటు పలువురు ఉన్నారు. తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని, హైదరాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ఉండి వంట చేస్తున్నట్టుగా ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. పచ్చడి తయారు చేస్తున్నట్టున్న మరో వీడియోను హేమ రిలీజ్ చేసింది. అయితే బెంగళూరు పోలీసులు ఆమె కథనాన్ని తోసిపుచ్చుతూ రేవ్ పార్టీలో ఆమె ఉన్న ఫొటోను విడుదల చేయడంతో సీన్ మారిపోయింది. కృష్ణవేణి పేరుతో నటి హేమ పార్టీకి హాజరైంది. పోలీసు రికార్డుల్లోనూ హేమ పేరు కృష్ణవేణిగా నమోదు చేయడం జరిగింది.

రేవ్‌ పార్టీలో పట్టుబడిన 101 మంది బ్లడ్‌ శాంపిల్స్‌ పరీక్షలు చేయగా.. 86 మందికి రక్త నమూనాలలో డ్రగ్స్‌ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఇందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. పార్టీలో ఉన్న 30 మంది మహిళల్లో 27 మంది మహిళలు డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.
డ్రగ్స్‌ తీసుకున్న వారందరికీ సీసీబీ పోలీసులు నోటీసులు పంపారు. పాజిటివ్ వచ్చిన వారందరికీ విడతల వారీగా నోటీసులు ఇవ్వడం జరిగింది. రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అనంతరం బెంగళూరు రూరల్‌ ఎన్డీపీఎస్‌ స్పెషల్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది. హేమ డ్రగ్స్‌ కేసులో పట్టుబడటంతో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆమెను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆగస్టులో హేమపై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.ఇప్పుడు ఆమెకు హైకోర్టు స్టే ఇచ్చింది.
Tags:    

Similar News