కర్ణాటక లో మరోసారి కన్నడ భాష వివాదం
టోల్ గేట్ మేనేజర్ తెలుగు, తమిళం మాత్రమే మాట్లాడటంపై స్థానికుల అభ్యంతరం;
By : Praveen Chepyala
Update: 2025-09-16 07:19 GMT
కర్ణాటకలో మరోసారి భాషా వివాదం తలెత్తింది. దేవనహళ్లి తాలుకా నల్లూర్ జాతీయ రహదారి టోల్ గేట్ మేనేజర్ కన్నడ మాట్లాడటానికి నిరాకరించడంతో బెంగళూర్ శివారు లో వివాదం చెలరేగింది. దీనిపై స్థానికులు, కన్నడ బాషా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..ప్రయాణికులు కొంతమంది మేనేజర్ ను కన్నడలో మాట్లాడాలని కోరారు. దీనితో ఆయన నాకు కన్నడ రాదని సమాధానమిచ్చాడు. ‘‘నాకు కన్నడ రాదు. ఇది జాతీయ రహదారి. నేను కన్నడ ఎందుకు మాట్లాడాలి?’’ అని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్య స్థానిక కన్నడిగులలో కోపాన్ని రేకెత్తించింది. వారు రాష్ట్ర భాష, సంస్కృతి పట్ల అగౌరవం చూపిస్తున్నారని ఆరోపించారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్..
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో మేనేజర్ కన్నడను ఉపయోగించడానికి నిరాకరించినట్లు తెలియజేస్తోంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది మరింత జనగ్రహానికి కారణమైంది.
టోల్ గేట్ లో ఒక సంవత్సరం పాటు పనిచేసినప్పటికీ తెలుగు మాట్లాడే మేనేజర్ కన్నడ నేర్చుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదని నెటిజన్లు చెప్పారు. అనేక మంది వినియోగదారులు ఈ సంఘటనపై తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.
కర్ణాటకలో రోజు పనిచేస్తున్నప్పటికీ తన సహోద్యోగులతో మాట్లాడే సమయంలో కూడా మేనేజన్ కన్నడ నేర్చుకోవడానికి బదులుగా తమిళం, తెలుగు పై ఆధారపడుతున్నాడని అన్నారు.
కన్నడ అనుకూల సంఘాలు ఇప్పుడు రంగంలోకి దిగి నిరసనలు చేపట్టి తక్షణ ప్రభుత్వ జోక్యం కోరుతున్నాయి. ఈ సంఘటన ప్రజా ప్రదేశాలు సంస్థలలో కన్నడ భాష పట్ల నిర్లక్ష్యం చేసే వారిపట్ల కఠినంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రానికి వచ్చే ప్రతి ఒక్కరూ కనీస స్థాయి కన్నడ నేర్చుకోవాలనే నియమాన్ని కఠినంగా అమలు చేయాలి’’ అని వారు ఒక ప్రకటనలో తెలిపారు.