కన్నడ నటుడు దర్శన్‌ను మరో జైలుకు తరలింపు.. కారణమేంటి?

రేణుకా స్వామి హత్య కేసులో నిందితులను మరో జైలుకు తరలించేందుకు 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ఏసీఎంఎం) కోర్టు అనుమతి ఇచ్చింది.

Update: 2024-08-29 07:44 GMT

కన్నడ నటుడు దర్శన్ తూగుదీపను గురువారం ఉదయం బళ్లారి జైలుకు తరలించారు. ఇటీవల తాను ఉంటున్న పరప్పన అగ్రహార జైలులో దర్శన్‌ రౌడీషీటర్‌తో సహా మరో ముగ్గురితో కలిసి తిరుగుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరలైంది. కుర్చీలో తాపీగా కూర్చుని సిగరెట్ తాగుతూ.. మరో చేతితో కాఫీ మగ్‌ చేతపట్టుకుని కనిపించాడు దర్శన్‌. దర్శన్‌కు జైలు అధికారులు రాచ మర్యాదలు చేస్తున్నారని వచ్చిన వార్తలపై కోర్టు విచారణకు ఆదేశించి, అగ్రహార జైలు చీఫ్ సూపరింటెండెంట్‌తో సహా తొమ్మిది మంది జైలు సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో దర్శన్‌ను బళ్లారి జైలుకు తరలించేందుకు బెంగళూరులోని కోర్టు మంగళవారం అనుమతి మంజూరు చేసింది.

కోర్టు విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు..

"దర్శన్‌ను మరో కోర్టుకు తరలించే విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ఇతర అధికారులతో సంప్రదించి జైలు అధికారులే నిర్ణయం తీసుకుంటారు. వారు (దర్శన, సహ నిందితులు) విచారణలో ఉన్నందున కొన్ని నిబంధనలు ఉన్నాయి. దాని ఆధారంగా అధికారులు నిర్ణయిస్తారు." అని పరమేశ్వర ఇటీవల విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఎవరు ఏ జైలుకు..

రేణుకా స్వామి హత్య కేసులో నిందితులను మరో జైలుకు తరలించేందుకు 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ఏసీఎంఎం) కోర్టు అనుమతి ఇచ్చింది. దర్శన్‌ను బళ్లారి జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించగా, సహ నిందితులు పవన్‌, రాఘవేంద్ర, నందీష్‌లను మైసూరు జైలుకు, జగదీష్‌, లక్ష్మణ్‌లను శివమొగ్గ జైలుకు, ధన్‌రాజ్‌ను ధార్వాడ్‌ జైలుకు, వినయ్‌ని విజయపుర జైలుకు, నాగరాజ్‌ను కలబురగి/గుల్బర్గా జైలుకు తరలించనున్నారు. ప్రదోష్ బెలగావి జైలుకు వెళ్లినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరో ముగ్గురు నిందితులు పవిత్ర గౌడ, అనుకుమార్, దీపక్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోనే ఉంచనున్నారు. మరో నలుగురు రవి, కార్తీక్, నిఖిల్, కేశవమూర్తిలను గతంలో తుమకూరు జైలుకు తరలించారు.

ఇటు రాష్ట్రంలోని జైళ్లలో అన్ని వ్యవస్థలను సమీక్షించేందుకు ఐపీఎస్ అధికారిని నియమించినట్లు హోంమంత్రి పరమేశ్వర ఇప్పటికే తెలిపారు.

రేణుకాస్వామిని ఎందుకు హత్య చేశారు?

సినీనటుడు దర్శన్‌‌కు దాదాపు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మితో పెళైంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. మోడల్‌, బుల్లితెర, సినీ నటి అయిన పవిత్ర గౌడతో దర్శన్‌ కొన్నేళ్లుగా కలిసి ఉంటున్నారు. ఈ సంబంధం వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందన్న బాధతో చిత్రదుర్గ జిల్లా కేంద్రానికి చెందిన రేణుకాస్వామి అనే యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పవిత్రను లక్ష్యంగా చేసుకుని ఆమెకు అశ్లీల సందేశాల పంపాడు. దర్శన్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించినట్లు పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసింది. 33 ఏళ్ల రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో ఛాలెంజింగ్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న దర్శన్‌, పవిత్ర గౌడ, ఆయన సహచరులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

Tags:    

Similar News