ఇ.ఫళనిస్వామికి సెంగొట్టయన్ అల్టిమేటం..

ఎన్నికల ప్రచారానికి AIADMK సీనియర్ నేత పెట్టిన కండీషన్ ఏమిటి? 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐక్య ఫ్రంట్ ఏర్పడుతుందా?;

Update: 2025-09-05 10:11 GMT
KA సెంగొట్టయన్ (ఎడమ) ఎడప్పాడి కె పళనిస్వామి (కుడి)
Click the Play button to listen to article

అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజ్గం (AIADMK) సీనియర్ నాయకుడు KA సెంగొట్టయన్(Sengottaiyan) పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి(Palaniswami)కి 10 రోజుల అల్టిమేటం జారీ చేశారు. పార్టీని వీడిన, బహిష్కరణకు గురైన నాయకులు, కార్యకర్తలను తిరిగి వెనక్కు తీసుకురావాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. తమిళనాడు(Tamil Nadu)2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐక్య ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కూడా కోరారు. అలా చేస్తేనే పళనిస్వామి ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. గోబిచెట్టిపాళయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "ఎఐఎడిఎంకెను వీడిన వారిని నిర్ణీత కాలవ్యవధిలోపు తిరిగి పార్టీలోకి తీసుకురావాలి. అలా చేస్తేనే పళనిస్వామి ప్రచారంలో పాల్గొంటా’’ అని చెప్పారు.

పార్టీ కోసం చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ సెంగొట్టయన్ ఇలా అన్నారు.. "అమ్మ (జయలలిత) మరణం తరువాత కూడా, మరో మార్గం ఎంచుకోవడానికి రెండు అవకాశాలు వచ్చాయి. పార్టీ ముక్కలు కాకూడదన్న ఉద్దేశంతో నేను వాటిని వినియోగించుకోలేదు. AIADMK ఐక్యంగా ఉండేందుకు ఎన్నో త్యాగాలు చేసా." అని చెప్పారు.

పార్టీలోని వివిధ వర్గాలను తిరిగి ఏకం చేయాల్సిన ఆవశ్యకతపై సెంగొట్టయన్ మాట్లాడుతూ.. "వెళ్లిపోయిన వారు షరతులు లేకుండా తిరిగి రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. వారిని ఆహ్వానించి పార్టీని బలోపేతం చేయాలని పళనిస్వామిని కోరుతున్నాం. 10 రోజుల్లోగా ఆ దిశగా చర్య తీసుకుంటారని ఆశిస్తున్నా. విజయానికి ఐక్యత ఒక్కటే మార్గం." అని పేర్కొన్నారు.

పళనిస్వామి ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే భావసారూప్యత గల నాయకుల నిర్ణయాత్మక చర్యకు దారితీయవచ్చని హెచ్చరించారు సెంగొట్టయన్. శశికళ, ఓ పన్నీర్‌సెల్వం వంటి నేతల పేర్లను సమావేశంలో ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.


ఇంతకు ఎవరీ సెంగొట్టయన్..

సెంగొట్టయన్ రాజకీయానుభవం ఉన్న సీనియర్ నాయకుడు. ఎంజి రామచంద్రన్ (ఎంజిఆర్) అన్నాడీఎంకేను స్థాపించిన సమయంలో 1972లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. 1975లో పార్టీ సర్వసభ్య సమావేశానికి కోశాధికారిగా కూడా వ్యవహరించారు.

1977లో సత్యమంగళం నియోజకవర్గం నుంచి పోటీ చేయమని MGR స్వయంగా సెంగొట్టయన్‌ను ఆదేశించారు. MGR మరణానంతరం పార్టీ ఐక్యంగా, బలంగా ఉండేందుకు జె. జయలలిత నాయకత్వం వహించమని ఒప్పించే బాధ్యత కూడా సెంగొట్టయన్ తీసుకున్నారు.


నాయకత్వానికి సవాల్.

AIADMKలో గందరగోళం, సెంగొట్టయన్ హెచ్చరికపై సీనియర్ జర్నలిస్ట్ T రామకృష్ణన్ ఇలా అభిప్రాయపడ్డారు. "సెంగొట్టయన్ వ్యాఖ్యలు AIADMK నాయకత్వానికి బహిరంగ సవాల్‌గా కనిపిస్తోంది. పార్టీని వీడిన వారిని తిరిగి తీసుకురావాలని ఈపీఎస్‌కు 10 రోజుల డెడ్‌లైన్ విధించారు. పార్టీ సీనియర్లు అదే కోరుకుంటున్నారు. గత ఎన్నికల తర్వాత కూడా ఆరుగురు సీనియర్ నాయకులు అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని కోరారు. కాని అప్పుడు EPS అంగీకరించలేదు. ఇప్పుడు అంగీకరిస్తారో లేదో చూడాలి."

"OPS తప్ప ఇప్పటివరకు ఎవరూ పునరేకీకరణ గురించి బహిరంగంగా మాట్లాడలేదు. సెంగొట్టయన్ ఇప్పుడు బహిరంగంగా ముందుకు వచ్చారు.

జయలలిత మరణం తర్వాత అంతర్గత చీలికలను ఎదుర్కొన్న అన్నాడీఎంకే ఇప్పుడు కీలక దశలో ఉంది. సెంగొట్టయన్ సాహసోపేత వైఖరి పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీసింది. పళనిస్వామి ఎలా స్పందిస్తారోనని పార్టీ శ్రేణులు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.

Tags:    

Similar News