‘రాజీనామా చేయనుగాక చేయను’

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టంగా ప్రకటించారు. తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు.

Update: 2024-10-05 12:01 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టంగా ప్రకటించారు. తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. “తప్పుడు ఆరోపణల ఆధారంగా ప్రతిపక్షాలు (నా) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే, నేను రాజీనామా చేయాలా? తప్పుడు ఆరోపణలకు సమాధానం చెబుతాం. ప్రజలకు నిజాలు చెబుతా' అని సిద్ధరామయ్య రాయచూర్‌లో విలేఖరులతో అన్నారు.

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలం కేటాయింపు కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో దళిత, గిరిజన నేతలతో రాజకీయ సంప్రదింపులు జరుగుతున్నాయని అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపడేశారు. ‘‘రాష్ట్ర మంత్రులు రాష్ట్రంలో జరగాల్సిన పనులు, చేపట్టాల్సిన ప్రాజెక్టుల కోసం కేంద్ర మంత్రులను, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలుస్తుంటారు. గతంలో కూడా ఇటువంటి సమావేశాలు జరిగాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి కూడా. అంతమాత్రాన ఏదో జరిగిపోతుందని ఊహించుకోనక్కర్లేదు.’’ అని సీఎం పేర్కొన్నారు.

మైసూరులో దసరా ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా జెడి(ఎస్) సీనియర్ ఎమ్మెల్యే జిటి దేవెగౌడ తనకు మద్దతు ఇవ్వడంపై మాట్లాడుతూ.. “GT దేవెగౌడ JD(S) కోర్ కమిటీ చైర్‌పర్సన్, మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) సభ్యులలో ఒకరు. అతను నిజం మాత్రమే చెప్పాడు. అందులో తప్పేముంది?" అని సిద్ధరామయ్య ప్రశ్నించారు.

కేసు నమోదు..

ముడా స్థలం కేటాయింపు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని గత కొంతకాలంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గవర్నర్ ఆమోదం, కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త పోలీసులు సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజు తదితరులపై సెప్టెంబర్ 27న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  

Tags:    

Similar News