నెల రోజుల తరువాత నింగిలోకి వెళ్లిన ఎఫ్-35
జూన్ 14న తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన్ స్టెల్త్ ఫైటర్ జెట్;
By : Praveen Chepyala
Update: 2025-07-22 11:54 GMT
సాంకేతిక కారణాలతో కేరళలోని తిరువనంతపురం లో నెల రోజులుగా ఉంటున్న బ్రిటిష్ ఫైటర్ జెట్ ఎఫ్ 35బీ మంగళవారం తిరిగి గాల్లోకి ఎగిరింది.
‘‘జూన్ 14న అత్యవసర మళ్లింపు తరువాత ల్యాండ్ అయిన యూకే ఎఫ్ 35 బీ విమానం ఈ రోజు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రాయం నుంచి బయలుదేరింది.
జూలై 6 నుంచి విరామం లేకుండా పనిచేస్తున్న యూకే ఇంజనీరింగ్ బృందం మరమ్మతులు, భద్రతా తనిఖీలను పూర్తి చేసింది. దీనితో విమానం తిరిగి యాక్టివ్ సర్వీస్ ను ప్రారంభించింది.
మరమ్మతు, పునరుద్దరణ ప్రక్రియ అంతటా భారత అధికారులు, విమానాశ్రాయ బృందాల మద్దతు, సహకారానికి యూకే కృతజ్ఞతలు. భారత్ దేశంతో మా రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మేము ఎదురు చూస్తున్నాము’’ అని బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి ఒకరు జాతీయ మీడియాకు చెప్పారు.
ఆస్ట్రేలియాకు పయనం..
నిర్వహణ పూర్తయిన తరువాత జెట్ ఉదయం 10.50 గంటలకు టేకాఫ్ అయిన ఆస్ట్రేలియాకు వెళ్లింది. రాడార్ నుంచి తప్పించుకునే స్టెల్త్ ఫైటర్ ను సోమవారం హ్యాంగర్ నుంచి బయటకు తీసుకు వచ్చి విమానాశ్రయ బేలో నిలిపి ఉంచారు.
బ్రిటీష్ రాయల్ నేవీ ఎఫ్ 35బీ లైట్నింగ్ ఫైటర్ జెట్ యూకే అత్యంత ఆధునాతన స్టెల్త్ ఫ్లీట్ లో భాగం. ప్రపంచంలోని అత్యంత ఆధునాతన యుద్ధ విమానాలలో ఇది ఒకటి. దీని ఖరీదు 110 మిలియన్ డాలర్లు. ఈ జెట్ సాంకేతిక లోపం తలెత్తిన తరువాత జూన్ 14 నుంచి కేరళలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిపివేశారు.
హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి నిర్వహణ
యూకే నేవీ విమాన వాహకనౌక హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి నడుస్తున్న ఈ యుద్ద విమానం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయవలసి వచ్చింది. సాంకేతిక లోపాలు విమాన వాహాక నౌకపై తిరిగి వెళ్లడానికి వీలు కల్పించలేదు. యూకే నుంచి వచ్చిన ఇంజనీర్ల బృందం దానికి మరమ్మతులు చేసింది.
కేరళలో ఉన్న సమయంలో ఈ జెట్ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని మీమ్స్ కు దారితీసింది. వాటిలో కేరళ పర్యాటక శాఖ నుంచి వచ్చిన ఒక వైరల్ మీమ్స్ కూడా ఉన్నాయి. అందులో ఆ స్టెల్త్ ఫైటర్ ను రాష్ట్ర సుందరమైన ప్రకృతి సౌందర్యాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడని పర్యాటకుడితో పోల్చారు.
స్పార్కెడ్ మీమ్స్
‘‘కేరళ.. మీరు ఎప్పుడు వదిలి వెళ్లకూడదనుకునే గమ్యస్థానం. ధన్యవాదాలు, ది ఫాక్సీ ఎఫ్ 35 త్రివేండ్రం, కేరళ టూరిజం అని పర్యాటక శాఖ ఎక్స్ లో ఒక పోస్ట్ లో పేర్కొంది. ఏఐ జనరేటేడ్ ఎఫ్ 35 బీ పాటు కేరళ చాలా అద్బుతమైన ప్రదేశం. నేను వెళ్లిపోవాలనుకోవడం లేదు.’’ అని దానిలో ఏఐ ద్వారా చెప్పించారు.
మీడియా నివేదికల ప్రకారం యుద్ధ జెట్ నిర్వహణ సాంకేతిక వివరాలను భారత్ తో పంచుకోవడానికి యూకే అధికారులు నిరాకరించారు. జూన్ 14న తిరువనంతపురం తీరంలో ఎగురుతున్నప్పుడూ ఎఫ్ 35బీ పంపిన ప్రమాద సంకేత వివరాలను ఫ్లైట్ రాడార్ డేటా సైట్ నుంచి తొలగించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.