‘NEET’పై తమిళనాడు అసెంబ్లీ తీర్మానం ఏమిటి?
NEET నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేశారు? ఆయన చెప్పిన కారణాలేంటి?
NEET నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని ప్రవేశపెట్టిన ఏకగ్రీవ తీర్మాణాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. ప్లస్ టూ పరీక్షల మార్కుల ఆధారంగా విద్యార్థులను వైద్య కోర్సులో చేర్చుకునేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరింది.
ఈ పరీక్షా విధానం వివక్షతో కూడుకున్నదని, గ్రామీణ, పేద విద్యార్థులు వైద్య విద్యకు నోచుకోవడం లేదని ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ అసెంబ్లీలో పేర్కొన్నారు. స్టాలిన్‌కు బిజెపి మిత్రపక్షం పిఎంకె మద్దతు పలికింది. కాగా NEET వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ వాదించారు. ‘నీట్ అవసరం.. నీట్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం ఆమోదయోగ్యం కాదు. వాకౌట్ చేస్తున్నాం’ అంటూ నాగేంద్రన్ బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి వాకౌట్ చేశారు.
నీట్ నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకోవడం, గ్రేస్ మార్కులు కలపడం, చివరకు పరీక్ష రద్దు చేయడం, సిబిఐ విచారణకు కేంద్రం ఆదేశించడాన్ని స్టాలిన్ సభలో ప్రస్తావించారు. నీట్‌లో అవకతవకలు చోటు చేసుకున్న నేపథ్యంలో నీట్‌ను రద్దు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కేంద్రానికి రాసిన లేఖలను కూడా స్టాలిన్ ప్రస్తావించారు.