ఈడీ సోదాల తర్వాత కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసిన పరమేశ్వర ..
హోం మంత్రికి చెందిన విద్యా సంస్థల్లో సోదాలు.. ఆర్ఠిక లావాదేవీలపై ఆరా..;
బంగారం అక్రమ రవాణా కేసు(Gold smuggling Case)తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ (Money laundering) కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గురువారం కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర (G.Parameshwara) విద్యా సంస్థలపై సోదాలు జరిగాయి.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shiva Kumrar) పరమేశ్వరకు మద్దతు పలికారు. సోదాల తర్వాత ఆయనతో పాటు సతీష్ జార్కిహోళి, దినేష్ గుండు రావు సహా అనేక మంది మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు బెంగళూరులోని సదాశివనగర్‌లోని పరమేశ్వర నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడారు.
నిజాయితీపరుడు పరమేశ్వరప్ప..
"ఏదైనా ఫ్యామిలీ అకేషన్ లేదా పెళ్లి సందర్భంగా రణ్యరావుకు రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షలు బహుమతిగా ఇచ్చి ఉండవచ్చు. దానర్థం పరమేశ్వర ఆమెను చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ప్రోత్సహించినట్లు కాదు. మనమందరం ప్రజా జీవితంలో ఉన్నాం. చాలా మంది ట్రస్టులు నడుపుతున్నారు. పరమేశ్వర నిజాయితీ గల వ్యక్తి, " అని అన్నారు.
అనంతరం డిప్యూటీ సీఎం విలేఖరులతో మాట్లాడుతూ.. "ఆమె (రావు) ఏదైనా తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం శిక్షించాలి. పరమేశ్వర విషయానికొస్తే.. ఆయన చట్టాన్ని గౌరవించే వ్యక్తి. హోంమంత్రి కూడా. పార్టీలో సీనియర్ కూడా. నిజాయితీపరుడు. పెళ్లికి ఆయన బహుమతిగా ఇచ్చి ఉండవచ్చు..అంతే," అని పేర్కొన్న శివకుమార్.
సీఎంతో పరమేశ్వర భేటీ..
తన విద్యా సంస్థలపై ED దాడుల నేపథ్యంలో.. కర్ణాటక హోం మంత్రి గురువారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) ను కలిశారు. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది తెలియాల్సి ఉంది. గోల్ట్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి దాడుల గురించి సీఎంకు పరమేశ్వర వివరించి ఉండవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈడీ దాడులకు వ్యతిరేకంగా పార్టీ నిరసన తెలుపుతుందా? అని అడిగిన ప్రశ్నకు.. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి సంబంధించిన కేసుతో సహా దేశవ్యాప్తంగా చట్టపరంగా, రాజకీయంగా కాంగ్రెస్ పోరాడుతుందని శివకుమార్ సమాధానమిచ్చారు.
ట్రస్ట్ నుంచి నిధుల మళ్లింపు: ED
ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిధులను "మళ్లించి" రణ్యా క్రెడిట్ కార్డ్ బిల్లుకు రూ. 40 లక్షలు చెల్లించారని ED అధికారులు అనుమానిస్తున్నారు. ఇది ఒక ప్రముఖ వ్యక్తి సూచనల మేరకు జరిగి ఉంటుందన్నది వారి అనుమానం. ఆ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపునకు డాక్యుమెంటేషన్ లేదా వోచర్లు లేవని అంటున్నారు.
EDకి సహకరిస్తా..
మనీలాండరింగ్ దర్యాప్తులో ఈడీకి పూర్తిగా సహకరిస్తానని చెప్పారు పరమేశ్వర. ఆర్థిక అవకతవకలపై ఈడీ పీఎంఎల్‌ఏ కింద రాష్ట్రంలోని 16 ప్రదేశాల్లో సోదాలు చేసిందని పేర్కొన్నారు. సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిద్ధార్థ మెడికల్ కాలేజీ సహా మూడు సంస్థలు, ఒక విశ్వవిద్యాలయానికి వెళ్లిన ఈడీ అధికారులు.. గత ఐదేళ్ల ఆర్థిక లావాదేవీల రికార్డులు కావాలని కోరారని చెప్పారు. ఈడీ విచారణకు పూర్తిగా సహకరించాలని కూడా తన సిబ్బందికి చెప్పానని పరమేశ్వర పేర్కొ్న్నారు.
తన సంస్థ ఖాతా నుంచి రణ్యారావు క్రెడిట్ కార్డ్ బిల్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చిందని అడిగిన ప్రశ్నకు పరమేశ్వర సమాధానం చెప్పలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాత స్పందిస్తానని చెప్పారు. తన దళిత నేపథ్యం కారణంగా తనను లక్ష్యంగా చేసుకున్నారని వస్తున్న ఊహాగానాలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు.
మార్చి 3న రణ్యా అరెస్టు..
దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన రణ్యారావు(Ranya Rao)ను కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చి 3న అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు DRI అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని, ఆమె నుంచి రూ.12.56 కోట్ల విలువ చేసే 14.2 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధించి బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు మంగళవారం (మే 20) రణ్య, ఆమె సహ నిందితుడు తరుణ్ కొండారు రాజుకు బెయిల్ మంజూరు చేసింది.