‘మనస్సాక్షే అత్యున్నత న్యాయస్థానం’

మహాత్మా గాంధీ జయంతి రోజున కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని కోర్టుల కంటే మనస్సాక్షే అత్యున్నత న్యాయస్థానం అని అన్నారు.

Update: 2024-10-02 12:36 GMT

“మన కోర్టులన్నింటికీ అత్యున్నత న్యాయస్థానం ఒకటుంది. అది మనస్సాక్షి కోర్టు అని మహాత్మా గాంధీజీ చెప్పారు. ఇది అన్ని కోర్టుల కంటే అత్యున్నత న్యాయస్థానం. కొన్నిసార్లు అందరికీ కోర్టుల నుంచి న్యాయం జరగకపోవచ్చు. కానీ నేను స్పష్టంగా చెప్పగలను. మనందరం మనస్సాక్షికి అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. ఇతరులు ఇష్టపడినా, ఇష్టపడకపోయినా.. వ్యతిరేకించినా, అభినందించినా.. మన మనస్సాక్షి ప్రకారం పని చేయడానికి ప్రయత్నించాలి." అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థల కేటాయింపులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య, మరికొందరిపై లోకాయుక్త, ఈడీ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎఫ్ఐఆర్ నమోదు

ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు.. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజు తదితరులపై లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు ఫైల్ చేసింది. సిద్ధరామయ్యపై విచారణ జరిపేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ మంజూరు చేసిన అనుమతిని హైకోర్టు సమర్థించిన ఒక రోజు తర్వాత ప్రత్యేక కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటుందని, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని చెబుతూ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను హైలైట్ చేశారు.

అందరూ సమానంగా ఉన్నపుడే..

కుల వ్యవస్థ, అంటరానితనానికి వ్యతిరేకంగా గాంధీ పోరాడారని, అయితే అంటరానితనం చాలా చోట్ల ఇప్పటికీ ఉందని సీఎం పేర్కొన్నారు. కుల వ్యవస్థ, అసమానతలు కేవలం ప్రసంగాలతో పోవని, విద్యలో సమానత్వం, ఆర్థికంగా, సామాజికంగా అందరూ సమానంగా ఉన్నప్పుడే అది పోతుందన్నారు. దేశం చూసిన నిజాయితీ గల రాజకీయ నాయకులలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని కూడా ఒకరని, గాంధీ జయంతి రోజున ఆయన జయంతి జరుపుకోవడం గొప్ప విశేషమన్నారు.

Tags:    

Similar News