కర్ణాటకలో సీఎం మార్పుపై పార్టీ నేతల నోరు మూయించిన అధిష్ఠానం

మార్చి నాటికి అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు.."నాకు తెలియదు. నేను జ్యోతిష్యుడిని కాదు,’’అని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు హోం మంత్రి పరమేశ్వర.;

Update: 2025-01-15 14:20 GMT

కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలకు చెక్ పెట్టారు. గత కొంతకాలంగా ఈ విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం వర్గీయులు పోటీపడి అవకాశం దొరికినప్పుడల్లా ఎక్కడపడితే అక్కడ మాట్లాడేస్తుండడంపై అధిష్ఠానం సీరియస్ అయినట్లు కనిపిస్తోంది. వీరి వ్యవహార శైలి పార్టీకి చెడ్డపేరు తెచ్చి పెట్టేలా ఉందని భావించి ఒక నిర్ణయం తీసుకుంది. పార్టీలో ఎవరూ కూడా అధికార మార్పిడి గురించి అసలు మాట్లాడొద్దని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఇదే విషయాన్ని హోమ్ మంత్రి జీ పరమేశ్వర (Parameshwara) బుధవారం బయటపెట్టారు.

"మాకు ఏ మార్పు గురించి మాట్లాడొద్దని కేంద్ర నాయకత్వ ప్రతినిధి, మా ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా సూచించారు. అందువల్ల ఇకపై ఆ అంశంపై చాలా తక్కువగా మాట్లాడతాం," అని చెప్పారు పరమేశ్వర. అలాగే రాష్ట్రంలో నాయకత్వ మార్పు గురించి పార్టీ సభ్యులెవరూ మాట్లాడదని కోరారు.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) ఇటీవల ఎస్‌సీ, ఎస్‌టి సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, శాసనసభ్యులతో విందుకు ఆహ్వానించడం చర్చకు దారితీసింది. అయితే ఈ కార్యక్రమం వాయిదా పడింది. ‘ముడా’(Muda) కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకుంటే.. ఆ స్థానంలో దళిత లేక గిరిజన మంత్రి కూర్చుంటారన్న చర్చ ఊపందుకుంది. దీనిపై కూడా హోం మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇతర నాయకులతో చర్చించి సమావేశంపై తర్వలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మంత్రివర్గంలో దళితులకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలని మంత్రి ఆర్.బి.తిమ్మపూర్ చేసిన వ్యాఖ్యలపై కూడా పరమేశ్వర స్పందించారు. తాను కూడా దళితుడినేనని చెబుతూ.. "ఆయన (తిమ్మపూర్) కూడా సమర్థుడు. 30 ఏళ్లకుపైగా రాజకీయాల్లో ఉన్నారు" అని పేర్కొన్నారు.

2023 ఎన్నికల విజయానంతరం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య అధికార మార్పిడి ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్య తప్పుకుంటారని శివకుమార్(Shivakumar), ఆయన అనుచరులు భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రికి మద్దతు ఇస్తున్న వర్గం అధికార మార్పిడికి అంగీకరించకపోవచ్చని సమాచారం.

బడ్జెట్ అనంతరం మార్చి నాటికి మార్పులు జరిగే అవకాశం ఉందా? అని అడిగినపుడు.. "నాకు తెలియదు... నేను జ్యోతిష్యుడు కాదు. జ్యోతిష్యం తెలిసి ఉంటే, నేను ఏదో చెప్పేవాణ్ని" అంటూ విలేఖరులకు నిట్టూర్పుగా సమాధానమిచ్చారు.

మంత్రుల పనితీరుపై సమీక్షా నివేదికల గురించి మాట్లాడుతూ.. నా విభాగానికి సంబంధించిన నివేదిక నేను సమర్పించాను.ఇది ఎందుకు కోరారో వారు చెప్పాలి," అని విలేఖరులకు రిప్లై ఇచ్చారు. 

Tags:    

Similar News