బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్.. కాంగ్రెస్, కాషాయ పార్టీ నేతల మాటల యుద్ధం..

‘‘బీజేపీ నాయకులకు ఉన్నవి రెండే దార్లు. మునిరత్నకు మద్దతుగా నిలిచి దళిత వ్యతిరేకులుగా ముద్ర వేసుకోవడం, రెండోది మునిరత్నను పార్టీ నుంచి బహిష్కరించడం" - సీఎం

Update: 2024-09-15 08:06 GMT

కర్ణాటక రాజరాజేశ్వరినగర్ బీజేపీ శాసనసభ్యుడు మునిరత్నను అరెస్టు చేశారు. వేధింపులు, బెదిరింపులు, కులం పేరుతో దూషించాడన్న ఆరోపణలతో ఆయనపై శుక్రవారం వయాలికావల్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి.

"మేము మునిరత్నను అదుపులోకి తీసుకున్నాం. అతన్ని కోలార్‌లో అదుపులోకి తీసుకొని బెంగళూరుకు తీసుకువచ్చాం. ఆ తర్వాత అతనిపై నమోదు అయిన కేసులకు సంబంధించి అరెస్టు చేశారు" అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మునిరత్నను మెడికల్ చెకప్ కోసం బౌరింగ్ ఆసుపత్రికి, ఆపై పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు అధికారిక వర్గాలు సమాచారం. ఇటు ఎమ్మెల్యే మద్దతుదారులు వయాలికావల్ పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడారు.

మేం కూడా ఫిర్యాదు చేస్తాం..

కాగా మునిరత్నపై ఆరోపణలు సత్యదూరమని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, న్యాయవాది సదానంద పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాము కూడా ఫిర్యాదుదారుడిపై కంప్లైంట్ చేస్తామని చెప్పారు. అవసరమయితే హైకోర్టును కూడా ఆశ్రయిస్తామన్నారు. మునిరత్న ఏదైనా తప్పు చేసి ఉంటే అతనిపై చర్య తీసుకోవాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోకతో సహా బిజెపి నాయకులు చెబుతూనే.. ఆయనను " హడావుడిగా అరెస్టు చేయడం" ప్రతీకార రాజకీయాలకు అద్దం పడుతుందన్నారు.

షోకాజ్ నోటీసు జారీ..

ఇటు క్రమశిక్షణను ఉల్లంఘించారని పేర్కొంటూ రాష్ట్ర బీజేపీ మునిరత్నంకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఐదు రోజుల్లో క్రమశిక్షణా కమిటీ ముందు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని అందులో కోరింది.

ఎఫ్ఐఆర్‌లో ఏముంది?

ఎమ్మెల్యే మునిరత్న రూ. 30 లక్షలు లంచంగా డిమాండ్ చేశారని, డబ్బు చెల్లించకపోతే తన కాంట్రాక్టు రద్దు చేస్తానని బెదిరించారని బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) కాంట్రాక్టర్ చెలువరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2021లో సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ కాంట్రాక్ట్ కోసం మునిరత్న తనను రూ.20 లక్షలు డిమాండ్ చేశారని, అయితే పనుల నిర్వహణకు అవసరమైన 10 వాహనాల కోసం డబ్బు చెల్లించినా, వాటిని మంజూరు చేయలేదని పేర్కొన్నారు. కాంట్రాక్టు పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యే తనను అనుమతించకపోగా, సెప్టెంబర్ 2023లో తనపై దాడి కూడా చేశారని ఆరోపించారు. పదే పదే వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చానని చెలువరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాంట్రాక్టర్‌ను బెదిరించడం, దుర్భాషలాడడం, వేధింపులకు గురిచేసినందుకు ప్రభుత్వ అధికారులతో సహా మరో ముగ్గురిపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. తనకు, మునిరత్నకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు కూడా చెలువరాజు బయటపెట్టారు.

ఆరోపణలు అవాస్తవం..

తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్యే మునిరత్న అంటున్నారు. గత 15 ఏళ్లలో తాను ఎప్పుడూ ఎవర్ని కించపరిచేలా మాట్లాడలేదని చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత, తనపై కుట్రలు ప్లాన్ చేశారని పేర్కొన్నారు. దేవరాజ్ అర్స్ ట్రక్ టెర్మినల్స్ లిమిటెడ్‌లో ప్రతి నెలా రూ.15 లక్షల అవకతవకలు జరిగాయని ఫిర్యాదు అందడంతో విచారణ జరిపించాలని కోరుతూ లేఖ రాశానని, ఆ రోజు నుంచి తనపై కుట్రలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇక ఫోన్ సంభాషణపై కూడా వివరణ ఇచ్చుకున్నారు. ఎవరి గొంతునైనా ఇమిటేట్ చేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు.

ఓటమి అవమానంతోనే..

‘‘అసెంబ్లీ ఎన్నికల్లో నా చేతిలో కాంగ్రెస్‌ కుస్మా హెచ్‌ ఓడిపోయారు. లోక్ సభ ఎన్నికల్లో బెంగళూరు రూరల్ నుంచి పోటీచేసిన డాక్టర్ మంజునాథ్‌ కాంగ్రెస్‌కు చెందిన డికె సురేష్‌‌పై విజయం సాధించారు. దీన్ని సహించలేక ఓడిపోయిన ఇద్దరూ కాంట్రాక్టర్ చెలువరాజును పావులా ఉపయోగించుకున్నారు. చెలువరాజు ఇప్పటివరకు 20 మందిపై అట్రాసిటీ కేసులు పెట్టాడు.’’ అని మునిరత్న వివరించారు.

బీజేపీపై విరుచుకుపడిన సీఎం..

మునిరత్న వ్యవహారంపై సీఎం సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనను వెనకేసుకొస్తున్న నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆచారాలు, సంస్కృతి గురించి మాట్లాడే @BJP4Karnataka నాయకులు ముందుగా మీ ఎమ్మెల్యే మునిరత్న నోరు కడగండి. మునిరత్న దళిత, వొక్కలిగ వర్గాలను అసభ్యంగా దూషించాడు. డబ్బు డిమాండ్ చేశాడు. చెల్లించకపోతే కాంట్రాక్టర్‌ను చంపేస్తానని బెదిరించాడు. ఇవన్నీ చాలా తీవ్రమైన నేరాలు. రాష్ట్ర శాంతిభద్రతల గురించి మీడియా ముందు ప్రసంగించే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు @BYVijayendra, ప్రతిపక్ష నాయకుడు @RAshokaBJP వారి ఎమ్మెల్యే మునిరత్న ముందు నిలబడి మాట్లాడే ధైర్యం ఉందా?. ఇప్పుడు బీజేపీ నాయకులకు ఉన్నవి రెండు దార్లు. ఒకటి మునిరత్నకు మద్దతుగా నిలిచి దళిత వ్యతిరేకులుగా ముద్ర వేసుకోవడం, రెండోది దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పి, మునిరత్నను పార్టీ నుంచి బహిష్కరించడం" అని పేర్కొన్నారు.

Tags:    

Similar News