ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలపై పార్టీ బహిష్కరణ వేటు..
పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆ ఇరువురు నేతలెవరు? అధిష్టానం ఎందుకు వారిపై చర్య తీసుకుంది? ఎందుకు?;
కర్ణాటక(Karnataka)లో ఇద్దరు సీనియర్ బీజేపీ(BJP) ఎమ్మెల్యేలపై వేటు పడింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సీనియర్ ఎమ్మెల్యేలు శివరామ్ హెబ్బార్(Shivram Hebbar), మాజీ మంత్రి ఎస్టీ సోమశేఖర్(ST Somashekar)ను పార్టీ సభ్యత్వం నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు. ప్రస్తుతం వారు నిర్వహిస్తోన్న అన్ని పదవుల నుంచి తప్పించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర మీడియాతో పంచుకున్నారు.
కారణమేంటి?
ఈ ఇద్దరూ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారు. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. ఈ రెండు కారణాలతో వీరిని పార్టీకి దూరంగా ఉంచారు.
కాంగ్రెస్(Congress)ను వీడి బీజేపీలోకి
శివరామ్ హెబ్బార్, ఎస్టీ సోమశేఖర్ ఇద్దరూ 2019లో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఇద్దరూ మంత్రులయ్యారు.
ఉత్తర కన్నడ జిల్లాలోని యల్లాపూర్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన హెబ్బార్.. గతంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి 2019లో బీజేపీలో చేరారు. ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో గెలవడంతో పాటు 2023 సార్వత్రిక ఎన్నికల్లో కూడా విజయం సాధించారు.
బెంగళూరులోని యశ్వంత్‌పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ 2019లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసిన ఈయన 2023 ఎన్నికల్లో ఓడిపోయారు.