Justice is Due | టెక్కీ సుభాష్ భార్య, కుటుంబసభ్యుల అరెస్ట్
‘‘జస్టిస్ ఈజ్ డ్యూ’’ అని రాసి ఉన్న కాగితం అతికించుకుని బెంగళూరులో అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం దేశంలో సంచలనం రేపింది.;
టెక్ ఎగ్జిక్యూటివ్ అతుల్ సుభాష్ భార్య ఆమె కుటుంబసభ్యులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 9న సుభాష్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భార్య నికిత సింఘానియాను హర్యానాలోని గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా.. ఆమె తల్లి నిషా సింఘానియా, సోదరుడు అనురాగ్ సింఘానియాను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిని శనివారం ఉదయం బెంగళూరుకు తీసుకువచ్చి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
అతుల్ సుభాష్ సూసైడ్ నోట్..
బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన టెక్కీ సుభాష్ (34) డిసెంబర్ 9న బెంగళూరులోని మున్నెకొలలులోని తన ఇంటిలో ఉరివేసుకున్నాడు. తప్పుడు కేసులు, చిత్రహింసల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన బలవన్మరణానికి భార్య, అత్తమామలే కారణమంటూ 24 పేజీల సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. వీడియోలో తన కష్టాల గురించి వివరించాడు.
అతుల్ సుభాష్‌కు 2020లో నికితతో పెళైంది. ఏడాది అనంతరం వీరికో కొడుకు పుట్టాడు. కొంతకాలానికి భార్య నుంచి సుభాష్‌కు వేధింపులు మొదలయ్యాయి. చివరకు ఇద్దరూ 2022లో విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది ఏప్రిల్‌లో నికిత కోర్టులో కేసు వేసింది. వరకట్నం కోసం అత్తమామలు వేధిస్తున్నారని, భర్త అసహజ శృంగారం కావాలని హింసిస్తున్నాడని ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్‌లో కేసు ఫైల్ చేసింది నికిత. కేసు పరిష్కారం కోసం నికిత రూ.3 కోట్లు డిమాండ్ చేసిందని, ఆమెకు, తన కొడుకు నెలకు రూ.80 వేలు భరణం చెల్లించాలని కోర్టు కోరిందని.. అయితే ఆమె ఇంకా ఎక్కువ కావాలని కోరుతుందని అతుల్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
నెలకు రూ. 2లక్షలు కావాలంటున్నారు..
తనతో పాటు తన కుటుంబ వేధింపుల వల్లే నికిత తండ్రి మరణించినట్లు కూడా కేసు దాఖలైనట్లు అతుల్ పేర్కొన్నాడు. అయితే ఆయనకు షుగర్, గుండె జబ్బులతో గత పదేళ్లుగా బాధపడుతున్నాడని, తమ పెళ్లి నాటికే వైద్యులు ఆయనకు కొన్ని నెలల సమయం ఇచ్చారని తెలిపారు. తన భార్య, ఆమె కుటుంబసభ్యలు తన కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టారని, ఆమెకు నెలకు రూ.2లక్షలు భరణం చెల్లించాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని అతుల్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
"ఇప్పుడు నేను వెళ్లిపోవడంతో బ్బు ఉండదు. నా వృద్ధ తల్లిదండ్రులను, నా సోదరుడిని వేధించడానికి ఎటువంటి ఆధారం ఉండదు. నేను నా శరీరాన్ని నాశనం చేసి ఉండవచ్చు, కానీ నేను నమ్మిన ప్రతిదాన్ని అది కాపాడింది" అని సూసైడ్ నోట్‌లో రాశాడు సుభాష్.