బెంగళూరులో దెబ్బతిన్న రోడ్లు..రూ.50 లక్షలు చెల్లించాలంటున్న పిటీషనర్..
దెబ్బతిన్న రహదారులపై ప్రయాణం చేయడం వల్ల ఆరోగ్యం పాడైందని..అందుకు కారణమైన బీబీఎంసీ తనకు డబ్బులు చెల్లించాలని నోటీసు పంపిన స్థానికుడు..;
బెంగళూరు(Bengaluru)లో రోడ్ల దుస్థితిని ఓ వ్యక్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాడు. దెబ్బతిన్న రహదారులు, గుంతలు తేలిన రోడ్లపై ప్రయాణించడం వల్ల తన ఆరోగ్యం దెబ్బతిన్నదని, అందుకు కారణమైన బెంగళూరు మహానగర పాలిక (BBMP) తనకు రూ.50 లక్షలు చెల్లించాలని లీగల్ నోటీసు(Legal Notice) పంపాడు. ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నా..మౌలిక సదుపాయాలు సమకూర్చడంతో BBMP అధికారులు విఫలమయ్యారని నోటీసులో పేర్కొన్నారు.
‘వైద్యానికి రూ.50 లక్షలు ఖర్చయ్యింది’..
"మెడ, వెన్నునొప్పితో బాధపడుతున్న నా క్లయింట్.. చికిత్స కోసం ఐదుగురు ఆర్థోపెడిక్ డాక్టర్లను కలవాల్సి వచ్చింది. సెయింట్ ఫిలోమినా ఆసుపత్రికి నాలుగుసార్లు వెళ్లారు. అధిక నొప్పి నుంచి ఉపశమనానికి ఆయనకు ఇంజెక్షన్లు ఇచ్చారు. గుంతలు తేలిన రోడ్లపై ప్రయాణించడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని వైద్యులు చెప్పారు. వారి సూచన మేరకు నా క్లయింట్ కొన్ని రకాల మందులు కూడా వాడుతున్నారు. తన ఆరోగ్య పరిస్థితి వల్ల ఎక్కడికి వెళ్లలేకపోతున్నారు. ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది." అని కిరణ్ తరపున న్యాయవాది కెవి లవీన్ నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే వైద్యులు, మందులకు రూ. 50 లక్షలు ఖర్చయ్యిందని, దీనికంతకటికి కారణమైన BBMP.. 15 రోజుల్లోపు రూ. 50 లక్షలు చెల్లించాలన్న పిటీషనర్.. అధికారులు సకాలంలో స్పందించకపోతే లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను సంప్రదిస్తానని పేర్కొన్నారు.