ట్రాయ్ అధికారినని రూ. 11 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
బెంగళూర్ టెకీ ఖాతాలు ఖాళీ చేసిన మోసగాళ్లు
By : 491
Update: 2024-12-24 08:56 GMT
డిజిటల్ అరెస్ట్ అనేది లేదని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. తాజాగా బెంగళూర్ కు చెందిన ఓ టేకీ ఇలా మోసపోయి రూ. 11. 8 కోట్లు పోగొట్టుకున్నాడు. తన ఆధార్ కార్డు దుర్వినియోగం అయిందని, మనీలాండరింగ్ కోసం నీ కార్డును వాడుకున్నారని సైబర్ మోసగాళ్లు ఫోన్ చేసి హెచ్చరించడంతో భయపడిపోయాడు. దాంతో అన్ని అకౌంట్ వివరాలు చెప్పడంతో ఖాతాలన్నీ ఖాళీ చేశాడు. 39 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు సంబంధించిన మోసం నవంబర్ 25 - డిసెంబర్ 12 మధ్య జరిగింది.
నేరం ఎలా జరిగిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 11న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారిగా చెప్పుకున్న వ్యక్తి నుంచి తనకు కాల్ వచ్చిందని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మోసగాళ్లు తన ఆధార్ నంబర్ తో సిమ్ తీసుకుని అక్రమంగా ప్రకటనలు, వేధింపులు చేశారని, దీనికి సంబంధించి ముంబైలోని కొలాబా సైబర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని తెలిపారు. నీ ఆధార్ నెంబర్ తో బ్యాంకు ఖాతాలు తెరిచి మనీలాండరింగ్ కు ఉపయోగిస్తున్నారని, తాను పోలీస్ అధికారినని సైబర్ నేరగాళ్లు టేకీని బయపెట్టారు.
సైబర్ నేరగాళ్లు ఈ విషయం గురించి మౌనంగా ఉండమని హెచ్చరించారు. అతను వర్చువల్ విచారణకు సహకరించకపోతే భౌతికంగా అరెస్టు చేస్తామని బెదిరించారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం, స్కైప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని కోరుతూ అతనికి ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చింది, ఆ తర్వాత ముంబై పోలీసు యూనిఫాం ధరించిన ఒక వ్యక్తి అతనికి వీడియో-కాల్ చేశాడు.
లావాదేవీలు నిర్వహించడానికి ఒక వ్యాపారవేత్త తన ఆధార్‌ను ఉపయోగించి బ్యాంక్ ఖాతాను తెరిచాడని పేర్కొన్నాడు. ఆ మొత్తం ఆరు కోట్ల రూపాయలని హెచ్చరించాడు. నిబంధనల ప్రకారం ఇది నేరమని, భయభ్రాంతులకు గురి చేశాడు. నవంబర్ 25న, పోలీసు యూనిఫారం ధరించిన మరొక వ్యక్తి అతనికి స్కైప్‌లో కాల్ చేసి, తన కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందని భయపెట్టాడు.
తను చెప్పినట్లు చేయకపోతే కుటుంబాన్ని మొత్తం అరెస్టు చేస్తానని బెదిరించాడు. ఇంకా, నకిలీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాలను ఉటంకిస్తూ మోసగాళ్లు వివిధ బ్యాంకు ఖాతాలకు అమౌంట్ బదిలీ చేయాలని బెదిరించాడు.
అరెస్టు భయంతో బాధితుడు పలు లావాదేవీల్లో మొత్తం ₹ 11.8 కోట్ల మొత్తాన్ని వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. అయితే తరువాత కూడా సైబర్ నేరగాళ్లు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడికి అనుమానం వచ్చి పోలీసులను సంప్రదించాడు. దీనిపై బెంగళూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ప్రభుత్వ ప్రయత్నాలు..
ప్రభుత్వ పత్రికా ప్రకటన ప్రకారం, దేశంలోని అన్ని రకాల సైబర్ నేరాలను సమన్వయంతో సమగ్రంగా ఎదుర్కోవడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 'ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్' (I4C)ని అనుబంధ కార్యాలయంగా ఏర్పాటు చేసింది.
ఇప్పటి వరకు, బాధితులు తమ డబ్బును పంపిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం ద్వారా 9.94 లక్షలకు పైగా ఫిర్యాదులలో ₹3,431 కోట్ల కంటే ఎక్కువ మొత్తం ఆదా చేశారు. స్కైప్ IDలు - 59,000 వాట్సాప్ ఖాతాలను డిజిటల్ అరెస్ట్ కోసం ముందస్తుగా గుర్తించి బ్లాక్ చేసిందని విడుదల చేసింది. సైబర్ మోసాలను అరికట్టడానికి దేశంలో 1930 నంబర్ ను ప్రారంభించారు. మోసం జరిగిన తరువాత రెండు గంటల్లో ఫిర్యాదు చేయాలి. వీటిని గోల్డెన్ అవర్స్ గా పేర్కొంటారు.