అన్నామలై స్థానం ఎవరికి దక్కబోతుంది?

తేవర్ కమ్యూనిటీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్, మరో బీజేపీ నాయకుడు కరుప్పు ఎం మురుగానందం పేర్లు ప్రచారంలో ఉన్నాయి.;

Update: 2025-04-04 12:34 GMT

తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తమిళనాడు(Tamil Nadu) బీజేపీ (BJP) చీఫ్ కె అన్నామలై (K Annamalai) శుక్రవారం ప్రకటించారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. తన స్థానంలో ఎవరు వస్తున్నారన్న విషయం తెలియదని చెప్పారు. కేంద్ర మంత్రిగా మీకు అవకాశం ఇస్తున్నారటగా.. అని అడిగిన ప్రశ్నకు తాను ఆ రేస్‌లో లేనని సమాధానమిచ్చారు.

తమిళుల వెంటే ఉంటా..

"నా రాజకీయ ప్రయాణం బీజేపీతో ముడిపడి ఉంది. అవినీతిని నిర్మూలించడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఆ లక్ష్యం కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ నేను ఢిల్లీకి వెళ్లినా.. ఒక రాత్రిలో తిరిగి వస్తాను" అని అన్నారు.

AIADMK షరతు పెట్టిందా?

తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సారి అధికార పీఠం దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అధినాయకత్వం AIADMKతో పొత్తుకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ చీఫ్ ఎడప్పాడి కె. పళనిస్వామి(K Palaniswami) ఇటీవల కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అన్నాడీఎంకే షరతు మేరకు అన్నామలైని తప్పిస్తున్నట్లు సమాచారం. అయితే 10వ తేదీలోపు కొత్త బీజేపీ చీఫ్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

నాన్ గౌండర్ సామాజిక వర్గం నుంచి..

అన్నామలై, పళనిస్వామి ఒకే సామాజిక వర్గానికి (గౌండర్) చెందినవారు. విభిన్నంగా ఆలోచించే బీజేపీ అధిష్టానం. వీరి కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని కాకుండా ఇతర సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని పార్టీ చీఫ్‌గా నియమించాలనుకుంటుంది.

ఆ లెక్కన తేవర్ కమ్యూనిటీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్, మరో బీజేపీ నాయకుడు కరుప్పు ఎం మురుగానందం పేర్లు వినిపిస్తున్నాయి. తిరునెల్వేలికి చెందిన నాగేంద్రన్‌కు దక్షిణాది జిల్లాలపై పట్టుంది. బీజేపీ చీఫ్‌గా అన్నామలై నియామక సమయంలో మురుగానందం పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. వీరిద్దరితో పాటు కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, కొంగు ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకురాలు, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ కూడా రేస్‌లో ఉన్నారు.

ఓట్ షేర్‌ను పెంచిన అన్నామలై ..

బీజేపీ చీఫ్‌గా జూలై 2021 నుంచి బాధ్యతలు చేపట్టిన అన్నామలై..DMKపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన నేతృత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో BJP ఓట్ షేర్‌ను 11.24 శాతానికి పెంచారు. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు చేసినపుడు కూడా DMK ని తీవ్రంగా విమర్శించారు.

కాగా అన్నామలై నిష్క్రమణ పార్టీ పునఃనిర్మాణంలో భాగం కావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయనకు జాతీయ స్థాయిలో కీలక పదవి అప్పగించే అవకాశం ఉందంటున్నారు. 

Tags:    

Similar News