Anna Varsity Sex Assault | నిందితుడు డీఎంకే సభ్యుడు..

చెన్నై అన్నా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో విద్యార్థినిపై అత్యాచార ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి డీఎంకే కార్యకర్త అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Update: 2024-12-26 11:17 GMT

చెన్నై అన్నా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో విద్యార్థినిపై అత్యాచార ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి డీఎంకే కార్యకర్త అని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. స్టాలిన్ ప్రభుత్వం వాటిని తోసిపుచ్చింది. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో సహా సీనియర్ డీఎంకె నాయకులతో నిందితుడు జ్ఞానశేఖరన్ దిగిన ఫొటోలను రాష్ట్ర బిజెపి చీఫ్ కె అన్నామలై సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అధికార పార్టీ స్పందించింది.

 నేర చరితుడే..

‘నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉంది. 15 లైంగిక నేరాల కేసుల్లో ప్రమేయం ఉన్నా..అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా నేరస్థుడు డీఎంకే సభ్యుడు. డీఎంకే కార్యనిర్వాహకులకు సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ పరిస్థితిని తమిళనాడు ప్రజలు ఎంతకాలం సహించాలి? అధికార పార్టీ సభ్యుడైతే నేరస్తులపై చర్యలు తీసుకోకూడదని తమిళనాడులో చట్టం ఉందా? స్థానిక డీఎంకే కార్యనిర్వాహకులు, మంత్రుల ఒత్తిడి కారణంగా పోలీసులు జ్ఞానశేఖరన్‌పై ఉన్న కేసులను దర్యాప్తు చేయడం లేదు. దీంతో జ్ఞానశేఖరన్‌ మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉంది’’ అని అన్నామలై అన్నారు.

‘డీఎంకే సంఘ విద్రోహుల ముఠా’

"అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన లైంగిక వేధింపుల ఘటన సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. నేర కార్యకలాపాలకు పాల్పడే సమూహంగా డీఎంకే తయారైంది. " అని మాజీ ముఖ్యమంత్రి ఇ పళనిస్వామి ఆరోపించారు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న జ్ఞానశేఖరన్‌ను అధికార డీఎంకే కాపాడుతోందని ఆరోపించారు.

ఆరోపణలను కొట్టిపారేసిన TN ప్రభుత్వం

పళనిస్వామి ఆరోపణలను తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్ రేగుపతి తోసిపుచ్చారు. ఉపముఖ్యమంత్రి ఉదయనిధి దగ్గర నిలబడి ఉన్నంత మాత్రాన ఫోటోకు వెయిటేజీ ఇవ్వలేమని మంత్రి అన్నారు. డీఎంకేకు చెందిన ఏ శరవణన్ మాట్లాడుతూ ఈ ఘటనలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.

Tags:    

Similar News