తమిళనాట పెరిగిన ఎన్‌కౌంటర్లు.. పోలీసుల సమాధానమేంటి?

తమిళనాడులో ఎన్‌కౌంటర్లు పెరిగాయి. గతంతో పోలిస్తే వాటి సంఖ్య పెరగడంపై మానవహక్కుల సంఘాల నేతలు, ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Update: 2024-09-28 12:12 GMT

తమిళనాడులో ఎన్‌కౌంటర్లు పెరిగాయి. గతంతో పోలిస్తే వాటి సంఖ్య పెరగడంపై మానవహక్కుల సంఘాల నేతలు, ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఎన్‌కౌంటర్లను సమర్థించుకుంటున్నారు.

ఇటీవల తమిళనాడు పోలీసులు ATM దోపిడీకి పాల్పడ్డారని హర్యానాకు చెందిన ముఠా సభ్యుడొకరిని కాల్చి చంపారు. ఈ ఘటనలో 2021లో DMK అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్ల సంఖ్య 18కి చేరింది. అంతకుముందు అన్నాడీఎంకే పాలనలో మే 2016 నుంచి మే 2021 మధ్యకాలంలో 17 ఎన్‌కౌంటర్లు జరిగాయి.

ఆందోళన వ్యక్తం చేస్తున్న మానవ హక్కుల సంఘాలు..

అధికార డిఎంకె పాలనలో పెరిగిపోతున్న ఎన్‌కౌంటర్లపై మానవ హక్కుల సంఘాల కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పియుసిఎల్) ప్రధాన కార్యదర్శి వి సురేష్ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ.. "రెండు రాజకీయ పార్టీల (డిఎంకె, ఎఐఎడిఎంకె) మధ్య ఎటువంటి తేడా లేదు. ఎన్‌కౌంటర్లు చేసి కేసు క్లోజ్ చేస్తారు. ఎన్‌కౌంటర్ చేయడం అంటే కేసు విచారణ చేపట్టేందుకు పోలీసులు సుముఖంగా లేరని అర్థం.’’ అని అన్నారు.

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌పై ఎఫ్‌ఐఆర్‌..

‘‘2010లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేసులో రిటైర్డ్ పోలీసు అధికారి ఎస్ వెల్లదురైపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సెప్టెంబర్ 27న మద్రాస్ హైకోర్టు (మధురై బెంచ్) ఆదేశించింది. వీరప్పన్‌‌ ఎన్‌కౌంటర్‌తో పాటు ఆ తర్వాత జరిగిన చాలా ఎన్‌కౌంటర్లలో "ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్"గా పేరు తెచ్చుకున్న వెల్లదురై ప్రమేయం ఉండడమే అందుకు కారణం. వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. రాష్ట్రంలో అకస్మాత్తుగా పెరుగుతున్న ఎన్‌కౌంటర్ల సంఖ్యను అరికట్టడానికి ఈ తీర్పు చాలా ముఖ్యమైనది.” అని న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త హెన్రీ టిఫాగ్నే అభిప్రాయపడ్డారు.

ఎన్‌కౌంటర్లపై విచారణ..

రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్ మరణాలపై విచారణ జరిపేందుకు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని హెన్రీ టిఫాగ్నే గతంలో మద్రాస్ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే ప్రతి ఎన్‌కౌంటర్‌పై తప్పనిసరిగా విచారణ జరపాలని, రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్‌కౌంటర్ హత్యపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని హెన్రీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ‘‘జరిగిన ఎన్‌కౌంటర్లను పరిశీలిస్తే తమ ప్రాణాలకు ముప్పు ఉందని అనుమానితులను లేదా రౌడీలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తున్నారు. అయితే సమగ్ర విచారణ జరిగినప్పుడే అసలు విషయం బయట పడుతుంది. ఎన్‌కౌంటర్‌కు గల కారణాలను తెలుసుకోవచ్చు. మేము ప్రతి ఎన్‌కౌంటర్‌ను సమర్థించలేము. ఇప్పుడు వాటి సంఖ్య పెరుగుతుంది’’ అని చెప్పారు.

ఏటీఎం దోపిడీ ఘటన..

ATM దోపిడీ కేసులో ఎన్‌కౌంటర్ చేసిన వ్యక్తి జుమాన్ (40) మినహా.. రాష్ట్రంలో ఎన్‌కౌంటర్లలో చనిపోయిన వారు క్రిమినల్ కేసుల్లో ఉన్నవారు.హిస్టరీ షీటర్లు. కొందరు క్రూరమైన నేరాలకు పాల్పడ్డారు. హత్యలు చేశారు.

‘అది మా చివరి ప్రయత్నం..’

మాజీ TN DGP M రవి పోలీసులకు మద్దతు పలికారు. ఎన్‌కౌంటర్లను "చివరి ప్రయత్నం"గా అభివర్ణించారు. ది ఫెడరల్‌తో ఆయన మాట్లాడుతూ.. “హర్యానాకు చెందిన ఈ ముఠా.. గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించి ఎస్‌బిఐ ఎటిఎంలు ఎక్కడున్నాయో తెలుసుకుంటారు. వాటిని ధ్వంసం చేసి డబ్బుతో ఉడాయిస్తారు. కంటైనర్ వాహనంలో పారిపోయేందుకు యత్నిస్తుండగా నామక్కల్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద ఆయుధాలు కూడా ఉండడంతో పోలీసులపై దాడి చేశారు.

వీళ్లు చేసే దొంగతనాలను బట్టి చూస్తే కొత్త నేరగాళ్లుగా కనిపించారు. పోలీసులు వారిని కాల్చడమే లక్ష్యంగా పెట్టుకోలేదు. వారు చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించలేదు. తమ భద్రత దృష్ట్యా ఒక వ్యక్తిని కాల్చారు. ఇతరులను అదుపులోకి తీసుకున్నారు" అని మాజీ DGP రవి చెప్పారు.

‘‘పోలీసులు చెప్పినా ముఠా సభ్యులు లొంగిపోలేదు. పైగా తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఒక బ్యాగ్‌లో కొంత నగదుతో ఘటనా స్థలం నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. తప్పించుకునేందుకు పోలీసులపైనే రాళ్లు రువ్వారు. గాయపడిన సిబ్బంది ఆసుపత్రిలో చేరారు.ఈ పరిస్థితుల్లో పోలీసులు తమ ప్రాణాలకే ముప్పు అని భావించారు’’ అని ఆయన వివరించారు. కాగా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని చాలా తేలికగా తీసుకున్నారని ప్రతిపక్ష పార్టీలు, మానవ హక్కుల కార్యకర్తలు అడిగినప్పుడు.. “ఎన్‌కౌంటర్లు పోలీసుల చివరి అస్త్రం” అని పేర్కొన్నారు.

ఘటనను సమర్థించుకున్న పోలీసులు..

తమిళనాడు పోలీసులు కూడా ప్రతి ఎన్‌కౌంటర్ హత్యను ఆత్మరక్షణ కోసమే చేశామని సమర్థించుకుంటున్నారు. ATM దోపిడీ ఘటనలో ముఠా సభ్యులు ఆయుధాలు కలిగి ఉన్నారని, వెంబడించే సమయంలో తమపై దాడి చేయడం వల్లే ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చిందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. దాడిలో గాయపడిన ఇద్దరు పోలీసు అధికారులు కోయంబత్తూరులో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కంటైనర్ ట్రక్కును విడిచిపెట్టిన ప్రదేశంలో ఒక అనుమానితుడు మరణించాడు. ఘటన తర్వాత మరో ఆరుగురిని అరెస్టు చేశారు. ఇదే గ్యాంగ్ కేరళలో పలు ఏటీఎంలు పగులగొట్టి సుమారు రూ.65 లక్షల నగదుతో కంటైనర్ ట్రక్కులో పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

‘ప్రాణాల మీదకు వచ్చినపుడు కాల్చారు’

విలేకరుల సమావేశంలో సేలం డీఐజీ ఈఎస్ ఉమా మాట్లాడుతూ ‘‘పోలీసుల హెచ్చరించినా వారు వినలేదు. పైగా పోలీసులపైనే దాడికి దిగారు. తమను తాము రక్షించుకోవడానికి ఒక వ్యక్తిని కాల్చారు. మిగిలిన ఆరుగురుని పట్టుకున్నారు. ఇప్పుడు వాళ్లంతా మా అదుపులో ఉన్నారు. మేం వారిని అరెస్టు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసాం. కాని పోలీసుల ప్రాణాలకే ముప్పు తలపెట్టారు. పైగా ముఠా సభ్యులు కంటైనర్‌ ట్రక్కును అడ్డదిడ్డంగా నడిపి రోడ్డుపై ఉన్న వ్యక్తులను కూడా గాయపరిచారు. ఎన్‌కౌంటర్ చేయడం మా లక్ష్యం కాదు. ముఠా సభ్యులకు చెప్పి చూశాం. హెచ్చరించాం. లొంగిపోలేదు. మా సిబ్బందిపై దాడికి యత్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని కాల్చారు.’’ అని జరిగిన ఘటనను వివరించారు. 

Tags:    

Similar News