మాదక ద్రవ్యాలకు బానిసై సొంత కుటుంబాన్నే హత్య చేసిన యువకుడు

పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన తరువాత వెలుగులోని వచ్చిన దారుణమైన సంఘటన;

Update: 2025-02-25 10:58 GMT

కేరళలో ఓ డ్రగ్ బానిస తన కుటుంబంలోని ఆరుగురు సభ్యులను హత్య చేసి పోలీసుల ముందు లొంగిపోవడం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి 20 -25 కిలోమీటర్ల దూరంలో ఉండే వెంజరమూడు ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

నిందితుడు అఫాన్ మొత్తం మూడు ఇళ్లలో ఈ హత్యలు చేశాడు. అందులో అఫాన్ అమ్మమ్మ, గర్ల్ ఫ్రెండ్, అతని మామ, అతని భార్య ఉన్నారు. 13 ఏళ్ల సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. తల్లి కూడా గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అతని మామ ఇంట్లోని అల్మారాలను తెరవడానికి ప్రయత్నాలు జరిగినట్లు కనిపించాయని, అయితే ఏదైన వస్తువులు మిస్ అయ్యాయా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదని పోలీసులు తెలిపారు.
నిందితుడు మాదక ద్రవ్యాలు వాడకానికి ఆధారాలు ఉన్నాయా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు దర్యాప్తు అధికారులు అవునని సమాధానం ఇచ్చారు. అయితే ఎంతమొత్తంలో, ఏ డ్రగ్స్ తీసుకున్నారో శాస్త్రీయ ఆధారాల తరువాతే తెలుస్తుందని తెలిపారు.
మూడు వేరే వేరే ఇళ్లలో హత్యలు జరిగాయని, వీటి కోసం మోటార్ సైకిల్ ను వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎందుకు ఈ హత్యలు చేశారనే విషయంలో ఇంకా పూర్తి విషయాలు తెలియవని అంటున్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి
హత్య జరిగిన ప్రదేశాలలో ఒకదాన్ని సందర్శించిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి జీ.ఆర్ . అనిల్ ఈ హత్యలు క్రూరమైనవని అభివర్ణించారు. ఇవన్నీ కూడా ముందస్తుగా ప్రణాళిక ప్రకారం జరిగాయని అన్నారు. ఏది కూడా ఏదో ఆవేశపూరితంగా జరిగిన సంఘటన కాదన్నారు. ఇటువంటి ఆలోచనలు సమాజానికి మంచి చేయవని అన్నారు.
సౌమ్యుడు, మృదు స్వభావి
అయితే అఫాన్ మంచి స్వభావం గల యువకుడని, సౌమ్యుడు, మృదు స్వభావని ఇంటి పక్కల వారు చెప్పారు. అతడు హత్య చేశాడని అంటే చుట్టుపక్కల వాళ్లు నమ్మలేకపోయారు.
అఫాన్ ఇంటికి సమీపంలో టీ దుకాణం నడుపుతున్న ఒక మహిళ మంగళవారం ఒక టీవీ ఛానెల్ లో మాట్లాడుతూ.. నిందితుడు తన సోదరుడితో స్నేహం చేసేవాడని తెలిపింది.
‘‘అతను అలా చేశాడని నేను నమ్మలేకపోయాను. అతను మంచి బాలుడు. అతని గురించి నేను చెప్పగలిగే ఒక్క చెడు విషయం కూడా లేదు. నిన్న మధ్యాహ్నం కూడా నేను అతనిని చూశాను. పోలీసులు వచ్చే వరకూ ఏమి జరిగిందో నాకు తెలియదు’’ అని ఆమె చెప్పింది. మిగిలిన వారు కూడా ఇలాంటి స్పందనే తెలిపారు.
నిందితుడు ఆస్పత్రిలో..
ఈ హత్యల తరువాత తాను విషం సేవించానని చెప్పడంతో ప్రస్తుతం అఫాన్ తిరువనంతపురం మెడికల్ కాలేజీలో ఆసుపత్రిలో ఉన్నందున పోలీసులు అతని అరెస్ట్ ను ఇంకా ధృవీకరించలేదు.
హత్యల వెనక ఉద్దేశం, హత్యలు చేయడానికి ఉపయోగించిన ఆయుధం వంటి వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే కుటుంబంలో ఆర్థిక సంక్షోభమే ఈ హత్యలకు కారణమని, అఫాన్ హత్యలు చేయడానికి సుత్తిని ఉపయోగించడని కొన్ని వార్తా నివేదికలు చెబుతున్నాయి. సోమవారం సాయంత్రం అఫాన్ వెంజరమూడు పోలీస్ స్టేషన్ లో హాజరై హత్యలు తానే చేసినట్లు అంగీకరించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.


Tags:    

Similar News