సంక్షేమ పథకాలలో సీఎం పేరు, ఫొటో వాడొచ్చు: సుప్రీంకోర్టు

మద్రాసు హైకోర్టు ఉత్తర్వును కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం -పిటీషనర్ అన్నాడీఎంకే నేతకు రూ. 10 లక్షల జరిమానా..;

Update: 2025-08-06 11:09 GMT

ప్రజా సంక్షేమ పథకాలలో సీఎం పేరు, ఫొటో వాడవద్దని మద్రాసు హైకోర్టు జూలై 31న తమిళనాడు(Tamil Nadu)లోని డీఎంకే(DMK) ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. అన్నాడీఎంకే నేత సి.వీ. షణ్ముగం వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ సుందర్ మోహన్‌తో కూడిన ధర్మాసనం విచారించి తీర్పును వెలువరించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది డీఎంకే. విచారణ చేపట్టిన న్యాయస్థానం బుధవారం తీర్పు చెప్పింది. సంక్షేమ పథకాల ప్రచారంలో బతికి ఉన్న వ్యక్తుల పేర్లు లేదా ఫొటోలను వాడువచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మద్రాసు హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయడంతో పాటు అనవసర పిటిషన్ దాఖలు చేసినందుకు షణ్ముగంకు ₹ 10 లక్షల జరిమానా విధించింది.

మద్రాసు హై కోర్టు తీర్పుపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, న్యాయమూర్తులు కే వినోద్ చంద్రన్, ఎన్వీ అంజరియాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. సంక్షేమ పథకాల ప్రచారంలో బతికి ఉన్న వ్యక్తుల పేర్లు లేదా ఫొటోలను వాడువచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికైన ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి పేరును సంక్షేమ పథకాల ప్రచారానికి వాడుకోవచ్చని తీర్పు చెప్పింది.

ఇంతకు ఏమిటి వివాదం?

డీఎంకే ఇటీవల ఓ ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. దానికి ‘‘ఉంగలుదన్ స్టాలిన్’’ (మీతో, స్టాలిన్) అని పేరు పెట్టింది. పార్టీ బలోపేతం కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే రాజకీయ ప్రచారానికి వాడుకుంటున్నారని పిటీషనర్, అన్నాడీఎంకే(AIADMK) నేత సి.వీ. షణ్ముగం మద్రాసు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 

Tags:    

Similar News