పశ్చిమ బెంగాల్‌లో SIR: CAAతో శరణార్థులకు బీజేపీ భరోసా?

సుమారు 700 CAA దరఖాస్తు సహాయ శిబిరాల ఏర్పాటులో కాషాయ పార్టీ నేతలు..

Update: 2025-10-25 11:45 GMT
Click the Play button to listen to article

పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో నవంబర్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)కు ఎలక్షన్ కమిషన్ సిద్ధమమవుతోంది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులకు అభయ మిచ్చేందుకు పౌరసత్వ సవరణ చట్టం (CAA)ను తీసుకువచ్చేందుకు కాషాయ పార్టీ (BJP)ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర బీజేపీ, ఇతర హిందూ మితవాద గ్రూపులతో కలిసి అక్టోబర్ 30 నాటికి తొమ్మిది సరిహద్దు జిల్లాల్లో సుమారు 700 CAA దరఖాస్తు సహాయ శిబిరాలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కాషాయ పార్టీకి మద్దతు పలికే మతువాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇందుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

CAA, S.I.R నిర్వహణపై కోల్‌కతాలో పార్టీ నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌లో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. హాజరైన వారి ప్రకారం.. "అక్టోబర్ 30 నాటికి సరిహద్దు జిల్లాల్లో కనీసం మూడు CAA సహాయ శిబిరాలను నిర్వహించాలి" అని పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 340 బ్లాక్‌లకు విస్తరించాలని ప్రణాళిక రచించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బిఎల్ సంతోష్, సునీల్ బన్సాల్, సీనియర్ రాష్ట్ర నాయకులు, సంస్థాగత కార్యకర్తలు హాజరైన ఈ వర్క్‌షాప్‌లో సీఏఏను ఎస్‌ఐఆర్ ప్రక్రియలో విలీనంపై సాధ్యాసాధ్యాల గురించి చర్చించారు.

బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులకు CAA రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని, SIR నుంచి వారి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించరని బీజేపీ నేతలు చెబుతున్నారు.

"SIR‌లో గందరగోళానికి అవకాశం లేదు. అయితే తృణమూల్ దానిని సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. భారత పౌరులుగా ఉన్న వారి పేర్లు ఓటరు జాబితాలో ఉంటాయి. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు CAA కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలి. వారు పౌరసత్వం పొందితే వారి పేర్లు కూడా S.I.R లో కూడా కనిపిస్తాయి" అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ పార్టీ సహచరులతో అన్నారు. అదే సమయంలో.. "చనిపోయిన, నకిలీ ఓటర్లు, చొరబాటుదారులకు అడ్డుకట్ట వేసేందుకు SIR అవసరమని బీజేపీ వాదిస్తుంది. SIR సరిగ్గా అమలయితే బెంగాల్‌లో కోటి మందికి పైగా "నకిలీ ఓటర్లు" తొలగించబడతారని వారంటున్నారు.


'మతపర కార్డులు' జారీ..

హరింఘట బీజేపీ ఎమ్మెల్యే అసిం సర్కార్ మాట్లాడుతూ..దశాబ్దాలుగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న హిందూ బీజేపీ మద్దతుదారులు, ముఖ్యంగా మతువాస్ ఇప్పుడు S.I.Rతో తమ పేర్లను తొలగిస్తారేమోనని భయపడుతున్నారని చెప్పారు. తమ పౌరసత్వ సమస్యలను CAA పరిష్కరిస్తుందని వారు పూర్తిగా నమ్మడం లేదన్నారు.

CAA దరఖాస్తులను సులభతరం చేయడానికి BJP మద్దతు ఉన్న ఆల్ ఇండియా మాతువా మహాసంఘ ఇటీవల మతపర కార్డులను జారీ చేసింది. ఇప్పటివరకు దాదాపు 2 లక్షల కార్డులు మాత్రమే జారీ కావడం నిరుత్సాహ పరుస్తుంది. ఈ కార్డులు CAAకు దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రక్రియను కొంత సులభతరం చేసేందుకు దోహదపడతాయి.

కాగా పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 25వేల మంది ప్రజలు CAA కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి.


టీఎంసీ ఎస్ఐఆర్ వ్యతిరేక ప్రచార ర్యాలీ..

తృణమూల్ కాంగ్రెస్ (TMC) SIRను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల నిజమైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు, SIRకు వ్యతిరేకంగా టీఎంసీ నవంబర్ రెండో వారంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కోల్‌కతాలో ఒక పెద్ద ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. 

Tags:    

Similar News