‘రాహుల్ ఆరోపణలపై ఈసీ దర్యాప్తు మొదలుపెట్టాలి’

ఎన్‌సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్..;

Update: 2025-08-09 12:58 GMT

రాహుల్ "ఓట్ల దొంగతనం" ఆరోపణలపై ఎన్నికల సంఘం (EC) దర్యాప్తు చేయాలని NCP (SP) అధ్యక్షుడు శరద్ పవార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన నాగ్‌పూర్‌లో విలేఖరులతో మాట్లాడుతూ మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ప్రతిపక్ష మహావికాస్ అఘాడి జాగ్రత్తలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు.


‘అందుకే వెనక వరుసలో కూర్చున్నాం..అంతే’

రాహుల్‌ ఏర్పాటుచేసిన ప్రజెంటేషన్‌లో శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ముందు వరుసలో కూర్చోవడంపై శరద్ పవార్ స్పందించారు. బీజేపీ దాన్ని రాజకీయ చేసి విభేదాలు సృష్టించాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రజెంటేషన్‌ సమయంలో టీవీ స్క్రీన్‌ సరిగ్గా కనిపిస్తుందనే ఆలోచనతో తాను, ఫరూఖ్‌ అబ్దుల్లా, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెనక వరుసలోనే కూర్చున్నామని, అంతకుమించి ఏమీ లేదన్నారు. ఇక సెప్టెంబర్ 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికపై తామింకా ఓ అభిప్రాయానికి రాలేదని వెల్లడించారు.


రాహుల్ విశ్లేషణ..

బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మకై ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని రాహుల్ గతంలో చాలాసార్లు ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గ ఓటింగ్ డేటాను న్యూఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో గురువారం విశ్లేషించారు. బెంగళూరు సెంట్రల్‌లో కాంగ్రెస్‌కు 626,208 ఓట్లు రాగా, బీజేపీకి 658,915 ఓట్లు వచ్చాయన్నారు. 32,707 ఓట్ల తేడాతో ఓడిపోయాయని చెప్పారు. ఏడు సెగ్మెంట్లలో ఆరు గెలిచినా.. మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ 1,14,000 ఓట్ల తేడాతో ఓడిపోయిందని, నియోజకవర్గంలో 100,250 ఓట్లను చోరీ చేశారని ఆరోపించారు. 

Tags:    

Similar News