బిల్లులపై నిర్ణయానికి డెడ్‌లైన్ ఫిక్స్ చేసిన సుప్రీంకోర్టు

రాష్ట్రపతికి మూడు నెలలు, గవర్నర్లకు ఒక మాసం గడువు...;

Update: 2025-04-12 11:45 GMT

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ బిల్లుల విషయంలో సంచలన తీర్పునిచ్చింది. తమ వద్దకు వచ్చే బిల్లులపై నిర్ణీత గడువులోపు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతి, గవర్నర్లకు సూచించింది.

రాష్ట్రపతికి మూడు నెలలు..

పరిశీలన కోసం తన వద్దకు వచ్చిన బిల్లులపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతి(President)కి సూచించింది. ఒకవేళ ఆలస్యమైతే అందుకు కారణాలను సదరు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి అని ఆదేశించింది. లేకపోతే సుప్రీంకోర్టుకు ఆశ్రయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి నిర్ణయానికి కాలపరిమితి లేదు. కాబట్టి మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం’’ అని అత్యున్నత న్యాయస్థానం (Superme Court) పేర్కొంది.

ఎందుకు ఈ నిర్ణయం..

శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి పంపగా ఆయన వాటిపై ఎలాంటి సమాధానం ఇవ్వకుండా తనవద్దే ఉంచుకున్నారని తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లుల్ని సమ్మతించకపోవడం, పునఃపరిశీలించాలని సూచిస్తూ వెనక్కి కూడా పంపడం లేదని తెలిపింది. రెండోసారి ఆమోదించిన బిల్లుల విషయంలోను ఆయన తీరు మారలేదంటూ పిటిషన్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంపై ఇటీవల సుప్రీం తీర్పు వెలువరించింది.

తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికుమార్‌ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్‌ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని తీర్పు వెలువరించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని మంగళవారం పేర్కొంది.

‘‘గవర్నర్‌ (Governor) 10 బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి పెట్టడం న్యాయ సమ్మతం కాని ఏకపక్ష చర్య. అందుకే ఆ చర్యను తోసిపుచ్చుతున్నాం’’ అని జస్టిస్‌ జె.బి.పర్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పెండింగులో పెట్టిన పది బిల్లులు గవర్నర్‌ ఆమోదం పొందినట్టే భావించాలని స్పష్టంచేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే ప్రథమం. ఒకవేళ మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్‌ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావించిన పక్షంలో మూడు నెలల్లోగా అలాంటి బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది.

గవర్నర్‌ ఈ కాల నిర్దేశాన్ని పాటించనిపక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రి మండలి సలహా మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్‌కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

Tags:    

Similar News