బీహార్ ఎన్నికలు: VIP పార్టీ చీఫ్ సహానీకి RJD నేత తేజస్వి 'అల్టిమేటం'
24 సీట్లు అడగ్గా.. 15 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వమని చెప్పిన మాజీ డిప్యూటీ సీఎం..
బీహార్(Bihar)లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Polls) సంబంధించి నామినేషన్ దాఖలుకు ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో వికాశీల్ ఇన్సాన్ పార్టీ (VIP) ముఖేష్ సహానీకి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వి యాదవ్(Tejashwi Yadav) అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. సహానీ 24 సీట్లు కావాలని డిమాండ్ చేయగా.. 15 సీట్ల కంటే మించి ఇవ్వమని తేజస్వి స్పష్టం చేశారు. దీంతో సహాని గ్రాండ్ అలయన్స్ నుంచి నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన నిర్ణయాన్ని గురువారం (అక్టోబర్ 16) మధ్యాహ్నం 12 గంటలకు విలేఖరుల సమావేశంలో వెల్లడించాల్సి ఉండగా..దాన్ని సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసుకున్నారు.
2018లో స్థాపించిన VIPకి బీహార్‌లోని మత్స్యకారుల బలం ఎక్కువ. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మొదట మహాఘట్బంధన్‌తో పొత్తు పెట్టుకుంది. కాని ఆశించినన్ని సీట్లు రాకపోవడంతో ఎన్డీఏ కూటమితో జతకట్టారు. 2020 ఎన్నికల్లో 11 సీట్లలో పోటీచేసి 4 సీట్లు గెలుచుకుంది. ఎమ్మెల్యేలలో ఒకరు చనిపోయిన తర్వాత ఆ పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.
బీహార్‌లో ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే తాను ఉప ముఖ్యమంత్రిని అవుతానని ముఖేష్ సహానీ గతంలో పేర్కొన్నారు. అయితే దానిపై కూటమి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
243 మంది సభ్యులున్న అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు 14న వెలవడతాయి.