ఈ ఏడాది వర్ష రుతువులు వాటి కోసం ఎదురు చూడకుండానే పలకరిస్తున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు వారం రోజులు ముందుగా అంటే మే 24న నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఆ సీజనులో వర్షాలు ఆశాజనకంగానే కురిశాయి. బుధవారం నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయి. ఆ మర్నాడే గురువారం ఈశాన్య రుతుపవనాలు కూడా ప్రవేశించాయి. వాస్తవానికి ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 20వ తేదీకి వారం రోజులు అటు ఇటుగా ప్రవేశిస్తాయి. కానీ ఈ ఏడాది నాలుగు రోజులు ముందుగానే ఇవి ఎంటర్ అయ్యాయి. ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, పాండిచేరి, కరైకల్, కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, కర్నాటక, కేరళల్లోకి ఇవి ప్రవేశించినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం వెల్లడించింది. ఈ రుతుపవనాల సీజను అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాలు దేశమంతటా వర్షిస్తాయి. కానీ ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతదేశంపై మాత్రమే ప్రభావం చూపుతాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వార్షిక వర్షపాతంలో 48 శాతం ఈశాన్య రుతుపవనాల ద్వారానే కురుస్తుంది. సాధారణంగా ఈ సీజనులో రాత్రి నుంచి మర్నాడు ఉదయం వరకు వర్షాలకు ఆస్కారమిస్తాయి. రాత్రి తొమ్మిది నుంచి తెల్లవారుజామున మూడు గంటల మధ్య ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. ఒక్కోసారి మూడు నాలుగు రోజులు వదలకుండా ముసురు పడతాయి. ఈ సీజనులోనే ఆంధ్రప్రదేశ్‌లో తుపానులు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా కోస్తాంధ్రలో తీరాన్ని దాటతాయి.
అప్పుడే మొదలైన ‘ఈశాన్య’ వర్షాలు..
ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై అప్పుడే మొదలైంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వానలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల్లో నైరుతి దిశగా గాలులు వీస్తుంటాయి. అదే ఈశాన్య రుతుపవనాల సీజనులో ఈశాన్యం నుంచి గాలులు వీస్తాయి. ఇప్పటికే రాష్ట్రంపైకి ఈశాన్య గాలులు వీయడం ఆరంభమైంది. వీటికి వర్షాలు తోడవడంతో చలి వాతావరణం కనిపిస్తోంది. ఈశాన్య రుతుపవనాల సీజనులో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
‘నైరుతి’లో 18 అల్పపీడనాలు..
సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజనులో సగటున 13 అల్పపీడనాలు ఏర్పడి 55 రోజుల పాటు వర్షిస్తాయి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా ఆ ‘నైరుతి’ సీజనులో 18 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఇవి 63 రోజుల పాటు వర్షాలను కురిపించాయి. మరోవైపు అల్పపీడనాల్లో కొన్ని వాయుగుండాలుగా మారాయి. ఇలా నైరుతి రుతుపవనాల సీజనాల్లో నాలుగు వాయుగుండాలు ఏర్పడ్డాయి. ఏటా ‘నైరుతి’ సీజనులో కనీసం రెండు తుపానులైనా ఏర్పడుతుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఒక్క తుపాను కూడా సంభవించలేదు. అయితే అల్పపీడనాలు, వాయుగుండాలకు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణిలు తోడై వర్షాలు సంతృప్తికరంగా కురవడానికి దోహదపడ్డాయి.
‘నైరుతి’లో సాధారణ వర్షపాతం..
మరోవైపు నైరుతి రుతుపవనాల సీజనులో (జూన్ 1 నుంచి అక్టోబర్ 16 వరకు) ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ సీజను మొత్తమ్మీద 690.5 మి.మీలకు గాను 642 మి.మీల వర్షపాతం (–7 శాతం) రికార్డయింది. కురవాల్సిన దానికంటే 19 శాతం లోపు కురిస్తే సాధారణం గాను, అంతకు మించి కురిస్తే అధికంగాను పరిగణిస్తారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే గుంటూరు జిల్లాలో 33.66 శాతం, చిత్తూరు (31.91 శాతం), కర్నూలు (20.5 శాతం) జిల్లాలోను అత్యధిక వర్షపాతం నమోదైంది. కాగా కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో లోటు వర్షపాతం, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. కోస్తాంధ్రలో 781.48కి 729.1 మి.మీలు, రాయలసీమలో 485.74 మి.మీలకు 535.6 మి.మీల చొప్పున వర్షం కురిసినట్టు ఏపీ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ రిసోర్సెస్ సిస్టమ్ తన నివేదికలో వెల్లడించింది.