ఫేస్‌బుక్ పోస్టుతో తండ్రీకొడుకులు దూరం
పెద్దకొడుకు తేజ్ ప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన ఆర్జేడీ చీఫ్ లాలు;
రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం (మే 25) తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్(Lalu Prasad Yadav)ను పార్టీ నుంచి బహిష్కరించారు. బాధ్యతా రహిత ప్రవర్తన కారణంగా ఆరేళ్ల పాటు దూరంగా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.
‘‘తేజ్ ప్రవర్తన కుటుంబ గౌరవం, సంప్రదాయాలకు ఇబ్బందికరం. అందుకే పార్టీ నుండి బహిష్కరిస్తున్నా’’ అని లాలూ ప్రసాద్ X లో పోస్ట్ చేశారు.
బహిష్కరణకు కారణమేంటి?
తేజ్ ప్రతాప్ ఒక మహిళతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఫొటో కింద "ఈ చిత్రంలో కనిపిస్తున్నది అనుష్క యాదవ్. మేము గత 12 సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు. మేం ప్రేమలో ఉన్నాం. 12 సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్నాం" అని రాసి ఉంది. అయితే ఆ ఫొటో తేజ్ ఫేస్‌బుక్ పేజీలోనే కనిపించడంతో లలూకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
గతంలోనే తేజ్‌కు పెళ్లి..
ఫొటోను చూసిన కొందరు 2018లో కోలాహలంగా జరిగిన తేజ్ వివాహాన్ని గుర్తు చేశారు. వాస్తవానికి తేజ్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యను యాదవ్ వివాహం చేసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత తేజ్ నుంచి ఐశ్వర్య దూరమయ్యారు. తన భర్త, అత్తమామలు తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఆమె గతంలో ఆరోపించారు.
అది గిట్టనివారి పని..
ఫేస్‌బుక్ పోస్ట్‌పై తీవ్ర దుమారం చెలరేగిన కొన్ని గంటల తర్వాత బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ స్పందించారు. తన ఫేస్‌బుక్ అకౌంట్"హ్యాక్" అయ్యిందని చెప్పారు. తనను, తన కుటుంబాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి గిట్టనివారు చేసిన పని అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
హ్యాక్ అయిన ఫేస్‌బుక్ పేజీ, పోస్ట్ గురించి యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారో లేదో తెలియదు. అయితే తన మద్దతుదారులు, అనుచరులు పుకార్లను పట్టించుకోవద్దు అని కోరారట.