అమరావతిలో కల్చరల్ సెంటర్..పేరు ఆలోచించండి

నిర్దేశిత గడువులోగా క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారును ఆదేశించారు.

Update: 2025-12-22 12:38 GMT

రాజధాని అమరావతి ప్రాంతంలో ఆధునిక కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు త్వరితగతిన భూమిని గుర్తించాలని సూచించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం వివిధ అంశాలను అథారిటీ ఆమోదించింది. అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించిన విషయాలపై సీఆర్డీఏ, ఏడీసీ అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...‘రాజధాని ప్రాంతంలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం అమరావతిలో ఇప్పటికే ఓ వేదికను నిర్మించి ఉంటే బాగుండేది. దీని కోసం అనువైన ప్రాంతాన్ని గుర్తించండి. ఏర్పాటు చేయబోయే కల్చరల్ సెంటర్‌కు ఏ పేరు పెడితే బాగుంటుందో ఆలోచించండి. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా కల్చరల్ సెంటర్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. 

నిర్దేశిత గడువులోగా అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలి. భూములిచ్చిన రైతులకు కేటాయించే ప్లాట్లకు లే అవుట్ల వద్ద పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలి. రాజధాని రైతుల సమస్యలపై జాప్యం లేకుండా పరిష్కరించాలి. రాజధాని పరిధిలో ఉన్న అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. అటవీ సంపద, నదీ పరివాహకం, కొండలు వంటివి అమరావతికి ప్రకృతి శోభను తీసుకొస్తాయి. వివిధ రకాల పూల మొక్కలను రాజధాని ప్రాంతంలో నాటి పర్యాటకులను... ప్రకృతి ప్రేమికులను ఆకర్షించాలి. అదే విధంగా పార్కులను ఏర్పాటు చేయాలి. అమరావతికి వచ్చే వారికి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో హోటళ్లు ఉండేలా చూడాలి. ఈ మేరకు వాటి నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి” అని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సీఎస్ విజయానంద్ సహా సీఆర్డీఏ, ఏడీసీ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
56వ సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన అంశాలు ఇవే..
• అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల్లో రూ.103.96 కోట్లతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు.
• అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాల కల్పనకు రూ.109 కోట్ల కేటాయింపు.
• శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణం.
• హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు తుళ్లూరులో 6 ఎకరాలు కేటాయింపు.
• 8400 క్యూసెక్కుల కెపాసిటీతో రూ.444 కోట్లతో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు.
• ఎల్పీఎస్ జోన్-8లో లే-అవుట్ల అభివృద్ధికి రూ.1358 కోట్లు కేటాయింపు.
• 202 ఎకరాల భూమి జరీబు లేదా మెట్ట ప్రాంతమా అని నిర్దారణకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు. వ్యవసాయం, ఉద్యానవనం, భూగర్భ జలాలు, రెవెన్యూ, సర్వే విభాగాలకు చెందిన అధికారులతో కమిటీ ఏర్పాటు.
Tags:    

Similar News