‘అందుకే సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా’

“ప్రజలు నాకు నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చాకే మళ్లీ సీఎంను అవుతా. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా.’’ - ఆప్ చీఫ్ కేజ్రీవాల్

Update: 2024-09-15 08:03 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తు్న్నట్లు ప్రకటించారు. ఆయన ఈ విషయాన్ని పార్టీ కార్యాలయంలో ఈ ప్రకటన చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే మహారాష్ట్రతో కలిసి నవంబర్‌లో దేశ రాజధానిలో ఎన్నికలు జరగాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు కేజ్రీవాల్ బహిరంగ సభలో పేర్కొన్నారు.

“ప్రజలు నాకు నిజాయితీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే నేను ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చుంటాను. జైలు నుంచి వచ్చిన తర్వాత నేను అగ్నిపరీక్ష ఎదుర్కోవాలనుకుంటున్నా.’’ అని పేర్కొన్నారు.

ఆప్ అధినేత చివరిసారిగా జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోయే ముందు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. జూన్ 2వ తేదీ వరకు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు ఆయనకు మేలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

త్వరలో కొత్త సీఎం ఎంపిక..

అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనతో నెక్స్ట్ సీఎం ఎవరన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై కూడా కేజ్రీవాల్ స్పష్టతనిచ్చారు. కొత్త సీఎం ఎంపిక కోసం రెండు, మూడ్రోజుల్లో పార్టీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఇదే సందర్భంలో బీజేపీపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘ఆప్‌లో చీలికలు తెచ్చి ఢిల్లీలో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పన్నింది. మా పార్టీని ముక్కలు చేసేందుకే నన్ను జైలుకు పంపారు. కానీ వారి ఎత్తులు పనిచేయలేదు. పార్టీని విచ్ఛిన్నం చేయలేకపోయారు. నన్ను జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులు సృష్టించినా.. రాజ్యాంగాన్ని రక్షించాలనే ఇన్నాళ్లు రాజీనామా చేయలేదు’’ అని కేజ్రీవాల్‌ అన్నారు.

Tags:    

Similar News