సమాజ్‌వాదీ నేత వ్యాఖ్యలపై ఎవరెలా స్పందించారు?

రామ్‌గోపాల్‌ యాదవ్‌ వ్యాఖ్యలు సంకుచిత ఆలోచనలకు నిదర్శనమన్న యూపీ సీఎం యోగి.. బీజేపీ, ఎస్పీలను తప్పుబట్టిన బీఎస్పీ అధినేత్రి మాయావతి..;

Update: 2025-05-16 08:39 GMT

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్‌ యాదవ్‌ (Ram Gopal Yadav) వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఉత్తర‌ప్రదేశ్ (Utter Pradesh) మోరాబాద్‌లో జ‌రిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అక్కడ కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజ‌య్ షా కల్నల్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఖురేషి ముస్లిం కావడంతో ఆమెపై షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, అయితే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ను రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆమెను వదిలేశారని పేర్కొన్నారు.

‘ఓ మంత్రి క‌ల్నల్ ఖురేషీని ఉద్దేశిస్తూ చేసిన మ‌త‌త‌త్వ వ్యాఖ్యల‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అత‌నిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని ఆదేశించింది. కానీ అతనికి వింగ్ క‌మాండర్‌ వ్యోమికా సింగ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతిల గురించి తెలియదు. లేదంటే వాళ్లని టార్గెట్ చేసేవారు’ అని అన్నారు గోపాల్ యాదవ్.

"నేను మీకు చెప్తాను. హర్యానాకు చెందిన వ్యోమిక సింగ్‌ది జాతవ్ సామాజికవర్గం. అలాగే పూర్ణియాకు చెందిన ఎయిర్ మార్షల్ భారతిది యాదవ సామాజిక వర్గం. ఈ ముగ్గురూ PDA (పిక్చాడా, దళిత, అల్పసంఖ్యాక లేదా వెనుకబడిన, దళితులు, మైనారిటీలు) నుంచి వచ్చారు. ఒకరు ముస్లిం కావడంతో వేధింపులకు గురయ్యారు. మరొకరు ఆమె రాజ్‌పుత్ అని భావించి ఆమెను విడిచిపెట్టారు.’’ అని పేర్కొన్నారు.

ఆపరేషన్ సిందూర్ వివరాలను వెల్లడించేందుకు మీడియా సమావేశానికి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో పాటు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి హాజరయ్యేవారు.

సీఎం యోగి ఆగ్రహం..

రామ్‌ గోపాల్‌ వ్యాఖ్యలపై యూపీ సీఎం(UP CM) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేస్తున్న సైనికులకు కులాలను ఆపాదించకూడదన్నారు. వారు ఏ కులానికి లేదా మతానికి ప్రతినిధులు కాదని పేర్కొన్నారు. వీర వనితను గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి యాదవ్‌ సంకుచిత ఆలోచనలకు నిదర్శనం’’ అని ట్వీట్ చేశారు.

కులం, మతాలకు అతీతం సైన్యం..

ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా రామ్ గోపాల్‌ యాదవ్‌ వ్యాఖ్యలపై స్పందించారు. "కులం, మతానికి అతీతమైనది సైన్యం. సైన్యానికి ఒకే ఒక విధి. అది 'దేశ రక్షణ'. సైన్యంలో కులం, మతం ప్రస్తావన తెచ్చిన వారిది సంకుచిత మనస్తత్వం ప్రధాని మోదీ సైన్యంలో కూడా మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి ఒక్కరూ ఆయనను విశ్వసించాలి" అని ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఎస్పీ, బీజేపీలపై మాయావతి విమర్శలు..

ఎస్పీ, బీజేపీ రెండింటినీ విమర్శిస్తూ బీఎస్పీ అధినేత్రి మాయావతి(Mayawati) 'ఎక్స్'లో ఇలా పోస్ట్ చేశారు. "పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారత సైన్య పరాక్రమానికి నిదర్శనం. మతం, కులం కోణంలో సైన్యాన్ని చూడకూడదు. ఈ విషయంలో బీజేపీ మంత్రి చేసిన తప్పును సీనియర్ ఎస్పీ నాయకుడు చేశారు. ఇది సిగ్గుచేటు. దీన్ని అందరూ ఖండించాలి", అని పేర్కొన్నారు.

బీజేపీని విమర్శించిన ఎస్పీ(SP) నేత జూహి సింగ్..

సమాజ్‌వాదీ పార్టీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు జూహి సింగ్ మాట్లాడుతూ.. "కల్నల్ సోఫియా ఖురేషి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రిని పదవి నుండి తొలగించకపోవడం మొత్తం సైన్యానికి అవమానకరం. సమాజ్‌వాదీ పార్టీపై ఏదైనా ఆరోపణ చేసే ముందు తమకు తాము ప్రశ్నించుకోవాలి," అని పేర్కొన్నారు.

హైకోర్టు ఆదేశాల మేరకు మంత్రి కున్వర్ విజయ్ షా ఎఫ్ఐఆర్ నమోదయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఆయన రాజీనామా చేయాలని ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఖురేషిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు క్షమాపణ కూడా చెప్పారు.

Tags:    

Similar News