రాహుల్ మణిపూర్ పర్యటన బాధితులకు భరోసా ఇచ్చిందా?

ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా.. రాహుల్ మణిపూర్ పర్యటన అటు బాధితుల్లో భరోసా నింపడమే కాకుండా.. ఇటు కేంద్రంపై ఒత్తిడి పెంచే అవకాశం కూడా ఉంది.

Update: 2024-07-09 07:03 GMT

మణిపూర్‌లో కొనసాగుతున్న పరిస్థితులపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిరాశ వ్యక్తం చేశారు. మే 3, 2023లో హింస చెలరేగిన తర్వాత రాష్ట్రంలో రాహుల్ పర్యటించడం ఇది మూడోసారి. బాధిత కుటుంబాలను పరామర్శించాక ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

"నిజం చెప్పాలంటే.. మణిపూర్ పరిస్థితి మెరుగుపడుతుందని ఆశించాను. కానీ అలా కనిపించడం లేదు. ఇక్కడి పరిస్థితులను దేశంలో ఎక్కడా చూడలేదు. రాష్ట్రం పూర్తిగా రెండుగా చీలిపోయింది. నేను మీ సోదరుడిగా ఇక్కడకు వచ్చాను. మీకు అండగా ఉంటా. మణిపూర్‌లో శాంతి స్థాపనకు కృషిచేస్తా. పరిస్థితిని చక్కదిద్దే ఏ ప్రయత్నానికైనా నా మద్దతు, పార్టీ మద్దతు ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

రాహుల్ సోమవారం ఢిల్లీ నుంచి సిల్చార్‌కు విమానంలో బయలుదేరి మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాకు చేరుకున్నారు. అక్కడ సహాయ శిబిరాలను సందర్శించిన అనంతరం సిల్చార్ విమానాశ్రయానికి తిరిగి వచ్చి ఇంఫాల్ చేరుకున్నారు. ఇంఫాల్ నుంచి చురచంద్‌పూర్ జిల్లా, బిష్ణుపూర్ జిల్లాలోని మోయిరాంగ్‌కు చేరుకుని సహాయ శిబిరాలను సందర్శించారు. సాయంత్రం ఇంఫాల్‌లో గవర్నర్ అనుసూయా ఉకేతో సమావేశమయ్యారు.

మణిపూర్‌లో పర్యటించాల్సిందిగా ప్రధానికి వినతి..

మణిపూర్‌లో పర్యటించాలని ప్రధాని మోదీని రాహుల్‌ కోరారు. ప్రధాని ఒకటి, రెండు రోజులు మణిపూర్‌లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవడం ద్వారా వారికి ఎంతో ఓదార్పు ఇచ్చినట్లవుతుందన్నారు.

కేంద్రంపై ఒత్తిడి తెస్తారా?

మణిపూర్‌లో ప్రజల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం, శాంతి పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్.. రాహుల్ పర్యటన లక్ష్యంగా కనిపిస్తుంది.

వాస్తవానికి మే 2, 2023 రాహుల్ మణిపూర్‌ను సందర్శించారు. ఆయన పర్యటన అప్పట్లో నిరాశ్రయులకు కొంత ఊరటనిచ్చింది.

ఎంపీ అంగోమ్‌చా బిమోల్ అకోయిజం కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 2024 జూలై 1న పార్లమెంటులో తన తొలి ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం గుర్తుండే ఉంటుంది.

రాహుల్ పర్యటన ఫలితానిస్తుందా?

మణిపూర్‌లో పర్యటించి, పరిస్థితులను చక్కదిద్దాలని ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్ కోరడం తప్ప మరో మార్గం లేదు. శాంతి స్థాపనకు చురుకైన పాత్ర వహించాలని స్థానిక నాయకులు, ఎన్‌జీవోలు, సంఘం ప్రతినిధులు రాహుల్ సూచించారు.

రాహుల్ పర్యటన కేంద్రంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మణిపూర్‌లో పరిస్థితులు.. వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరుకు అద్దం పడుతుంది.  

Tags:    

Similar News