బెంగాల్‌లో పూరీ జగన్నాథ ఆలయం ఎందుకు వివాదాస్పదమవుతుంది?

బెంగాళీలు ఎక్కువగా పూరీ జగన్నాథుడిని ఆరాధిస్తారు. స్వామి దర్శనార్థం ఏటా లక్షలాది మంది అక్కడికి వెళ్తారు.;

Update: 2025-04-30 12:03 GMT

పశ్చిమ బెంగాల్‌(West Bengal) రాష్ట్రం దీఘా పట్టణంలో కొత్త జగన్నాథ ఆలయ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఆలయాన్ని ఏప్రిల్ 30న ప్రారంభించనున్నారు. ఒడిశా(Odisha) రాష్ట్రంలోని పూరీ జగన్నాథ స్వామి (Puri Jagannath temple) ఆలయాన్ని పోలి ఉన్న ఈ ఆలయం దీఘా రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉంటుంది. 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు చేశారు. రాజస్థాన్‌లోని బంసీ పహాడ్‌పూర్ గులాబీ రాళ్లతో నిర్మించిన ఆ ఆలయంలో పూరి ఆలయంలో ఉన్నట్లుగానే గర్భగుడి, సభా మండపం, నాట్య మండపం, భోగ మండపం ఉన్నాయి.

పూరీ ఆలయంలాగే ఎందుకు?

బెంగాళీలు ఎక్కువగా పూరి జగన్నాథుడిని ఆరాధిస్తారు. స్వామి దర్శనార్థం ఏటా లక్షలాది మంది బెంగాళీలు పూరీకి వెళ్తారు. అక్కడ జరిగే రథోత్సవం మరో ప్రత్యేక ఆకర్షణ. ఈ వేడుకను చూసేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది బెంగాళీలే.

ప్రతిష్టోత్సవానికి వెళ్లొద్దు..

మమతా సర్కారు నిర్మించిన దీఘా ఆలయంలో ఆచారాలు.. పూరీ జగన్నాథ ఆలయ ఆచారాలకు భిన్నంగా ఉండడంతో పూరీ ఆలయంలోని రెండు ప్రధాన సేవకుల సంఘాలు - సుఆర్ మహాసుఆర్ నియోగ్, పుష్పలక నియోగ్ తమ అర్చకులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్లొద్దని సూచించారు.

పుష్పలక నియోగ్ సభ్యులు బలభద్ర, సుభద్ర, జగన్నాథ స్వామిని అలంకరిస్తారు. దీఘాలో జరిగే పూజలు పూరీ ఆలయ సంప్రదాయాలను భిన్నంగా ఉన్నాయని చెప్పారు. సుఆర్ మహాసుఆర్ నియోగ్ సభ్యులు అన్నప్రసాదం తయారు చేస్తారు. వీరు తమ సభ్యులెవరూ కూడా అక్కడ వంట చేయకూడదని చెప్పారు.

తమ సేవకులు దిఘా ఆలయాన్ని సందర్శించడంపై ఎలాంటి నిషేధం లేదని, అయితే వారు అక్కడ వంట చేయకూడదని చెప్పామని సువార్ మహాసువార్ నిజోగ్ అధ్యక్షుడు పద్మనవ మహాసువార్ మీడియాతో అన్నారు.

ప్రభుత్వ ధనంతో ఎలా నిర్మిస్తారు?

ఈ ఆలయం రాజకీయ వివాదానికి కారణమైంది. మమతాను బీజేపీ ఇప్పటికే "నకిలీ హిందూ"గా ముద్ర వేస్తోంది. ఆలయాలకు ప్రభుత్వం డబ్బు ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నిస్తోంది. అయోధ్య రామాలయాన్ని ప్రజల విరాళాలతో నిర్మించారని, ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదని బీజేపీ నాయకుడు సువేందు అధికారి పేర్కొన్నారు. ఇది ఆలయమా? లేక సాంస్కృతిక కేంద్రమా? అన్న దానిపై స్పష్టత రాలేదన్నారు. ప్రాజెక్ట్ దస్తావేజుల్లో మాత్రం “జగన్నాథ ధామ్ సాంస్కృతిక కేంద్రం”గా పేర్కొన్నారని చెప్పారు.

ఎన్నికల కోసమేనా?

పశ్చిమ బెంగాల్‌ను ఇంటర్నెషనల్ టూరిజం స్పాట్‌గా మార్చాలన్న ఆశ మమతాకు చాలా ఏళ్ల నుంచి ఉంది. 2026 ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హిందువులను తమ వైపు తిప్పుకునే వ్యూహంలో భాగంగానే ఈ ఆలయ నిర్మాణం జరిగిందని కొందరి రాజకీయ విశ్లేషకుల మాట. ముర్షిదాబాద్ అల్లర్ల తర్వాత మమతకు హిందు వ్యతిరేకిగా ముద్ర పడింది.

ఇకపై పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలు “జై శ్రీరాం” అని నినదిస్తే.. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు “జై జగన్నాథ్” అని బదిలిస్తారేమో.. 

Tags:    

Similar News