నరసరావుపేట ప్రభుత్వ వైద్యుడు సస్పెండ్
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది.
విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించిన నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలోని సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ టి. నారాయణ స్వామిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 26 తేదీన నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళకు ట్యూబెక్టమీ ఆపరేషన్ నిర్వహించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనపై విచారణ జరిపిన అనంతరం ప్రభుత్వం ఆయన పై సస్పెన్షన్ వేటు వేసింది. ఆపరేషన్ చేసి మహిళ శరీరంలో తీవ్ర నిర్లక్ష్యంతో సర్జికల్ బ్లేడ్ ను వదిలేసినట్టు తరువాత జరిపిన వైద్య పరీక్షల ద్వారా వెలుగు చూసింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ నారాయణ స్వామి తన విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించారని ప్రాధమిక విచారణ నివేదిక పేర్కొంది. ఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విధుల్లో నిర్లక్ష్యం వహించిన వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రి సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ టి.నారాయణ స్వామిని సస్పెండ్ చేస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.