Farmers Protest | దల్లేవాల్‌ను కలిసిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి,డీజీపీ

కేంద్రం, పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధులు వెంటనే దల్లేవాల్‌ను కలవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన రెండు రోజుల తర్వాత డీజీపీ యాదవ్ భేటీ కావడం గమనార్హం.

Update: 2024-12-15 12:16 GMT

పంజాబ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) గౌరవ్‌ యాదవ్‌, హోం మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ మయాంక్‌ మిశ్రా ఆదివారం రైతు నాయకుడు జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను కేంద్రం పరిష్కరించాలని దల్లేవాల్‌ ఆమరణ దీక్ష చేపట్టిన విషయ తెలిసిందే.

క్యాన్సర్‌తో బాధపడుతున్న 70 ఏళ్ల దల్లెవాల్.. ఎమ్‌ఎస్‌పికి చట్టపర హామీతో సహా ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్‌లను ఆమోదించాలని నవంబర్ 26 నుంచి పంజాబ్, హర్యానా మధ్య ఖనౌరీ సరిహద్దు వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

దల్లేవాల్‌ను కలిశాక డీజీపీ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. దల్లేవాల్‌ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు వచ్చామని చెప్పారు. కేంద్రం భారత ప్రభుత్వ ప్రతినిధి మయాంక్ మిశ్రాను ప్రత్యేకంగా ఇక్కడికి పంపినట్లు ఆయన తెలిపారు.

ఖానౌరీ సరిహద్దు పాయింట్ వద్ద జరిగిన సమావేశంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మన్‌దీప్ సింగ్ సిద్ధూ, పాటియాలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నానక్ సింగ్‌, పాటియాలా డిప్యూటీ కమిషనర్ ప్రీతీ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఖానౌరీ సరిహద్దు పాయింట్ వద్ద నిరసన ప్రదేశానికి చేరుకునే ముందు రైతు నాయకుడు సుఖ్‌జిత్ సింగ్ హర్దోజాండే, కాకా సింగ్ కోట్డా ఇతర నాయకులతో కూడా యాదవ్ సమావేశమయ్యారు.

సుప్రీం జోక్యంతో..

కేంద్రం, పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధులు వెంటనే దల్లేవాల్‌ను కలవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన రెండు రోజుల తర్వాత డీజీపీ యాదవ్ భేటీ కావడం గమనార్హం. అతని ప్రాణం విలువైనదని పేర్కొంటూ అతనికి వైద్య సహాయం అందించి, దీక్ష విరమించేలా ఒప్పించాలని కోర్టు కోరింది. వైద్యులు ఇప్పటికే దల్లేవాల్‌ను ఆసుపత్రిలో చేర్చాలని సిఫార్సు చేశారు. సుదీర్ఘ ఉపవాసం కారణంగా దల్లేవాల్‌ బలహీనంగా మారాడని చెప్పారు.

రైతుల డిమాండ్లివి..

పంటలకు కనీస మద్దతు ధర, పంటల రుణమాఫీ, రైతులు, రైతు కూలీలకు పెన్షన్, విద్యుత్ ఛార్జీల పెంపు ఉపసంహరణ, రైతులపై పోలీసు కేసుల ఉపసంహరణ, 2021 లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం, 2013 భూసేకరణ చట్టం పునరుద్ధరణ, 2020-21 ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు.

Tags:    

Similar News