తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్న ప్రైవేటు స్కూళ్ల యజమాన్యాలు..

పిల్లల అడ్మిషన్లకు తల్లిదండ్రుల ప్రయత్నాలను నీరు గారుస్తున్న వైనం..;

Update: 2025-05-20 14:10 GMT

గుజరాత్‌(Gujarat)లో విద్యాహక్కు (RTE) చట్టాన్ని ప్రైవేట్ పాఠశాలల (Private schools) యాజమాన్యాలు తుంగలో తొక్కేస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం మొత్తం సీట్లలో 25 శాతం సీట్లను బలహీన(EWS), వెనుకబడిన వర్గాలు, ప్రత్యేక అవసరాలల పిల్లల(CWSN)కు కేటాయించాలన్న నిబంధన ఉన్నా.. ఎక్కడా అమలు కావడం లేదు. నిబంధలను పాటించాలని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు పదేపదే చెబ్బుతున్నా చెవికెక్కించుకోవడం లేదు. తమ పిల్లల అడ్మిషన్ కోసం వెళ్లిన తల్లిదండ్రులకు ఆ సర్టిఫికెట్ తీసుకురా..ఈ సర్టిఫికెట్ పనికిరాదంటూ తిప్పి పంపుతున్నారు. ఈ విషయంపై జిల్లా అడ్మిషన్ ఆఫీసర్ (DEO) రోహిత్ చౌదరి స్పష్టతనిచ్చారు. RTE చట్టం కింద సమర్పించాల్సినవి తప్ప మరే ఇతర పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యా శాఖ స్కూళ్లల్లో అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. లాటరీ విధానంలో సీటు పొందిన విద్యార్థులను చేర్చుకోవాలని అందులో స్పష్టంగా పేర్కొంది. అయితే కొన్ని పాఠశాలలు ఏవో కారణాలు చెబుతూ అడ్మిషన్ ఫారాలు కూడా ఇవ్వడం లేదని కొందరు తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు.

ఇన్‌కం సర్టిఫెకెట్ సమర్పించినా..

"అహ్మదాబాద్‌లో నా కొడుకును 4వ తరగతిలో చేర్పించాలని కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నా. ఫస్ట్ లిస్ట్‌లో నా కొడుకు పేరు వచ్చింది. అడ్మిషన్ సమయంలో ఇన్‌కం సర్టిఫికెట్ చూపాలని నాకు తెలుసు. అందుకే నేను డెట్రోజ్‌లోని గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి దాన్ని తీసుకొచ్చాను. కానీ ఆ సర్టిఫికేట్ పనిచేయదని చెబుతున్నారు. మరో ఇన్‌కం సర్టిఫికేట్ కావాలని చెప్పడంతో అప్పటి నుంచి నేను అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. నాకు మరో ఆదాయ సర్టిఫికెట్ ఎవరు ఇస్తారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా," అని బాధతో చెప్పారు సోలంకి.

మరో తల్లి ఆవేదన..

"అహ్మదాబాద్‌లోని ఒక పాఠశాల యాజమాన్యం నా బిడ్డను చేర్చుకోకుండా నన్ను నిరుత్సాహపరిచింది. నా కొడుకు ఇతర పిల్లలతో ఇమడలేడని, ఇతర విద్యార్థులు ఎగతాళి చేస్తే పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించదని చెప్పారు,’’ అని అంగన్‌వాడీ కార్యకర్త రష్మిబెన్ రాథోడ్ ది ఫెడరల్‌కు చెప్పారు.

ఇది సూరత్‌కు చెందిన జాన్విబెన్ ఆవేదన..

"స్కూల్ అడ్మిషన్ కావాలంటే విడాకుల సర్టిఫికేట్ లేదా భర్త డెత్ సర్టిఫికేట్ అవసరమని చెప్పారు. ఐదేళ్ల చట్టపర ప్రక్రియ తర్వాత నాకు ఈ మధ్యే విడాకులు మంజూరు అయ్యాయి. కోర్టు నుంచి కాపీ అందాల్సి ఉంది. ఈ ఒక్కటి తప్ప అడ్మిషన్‌కు అవసరమైన అన్ని సర్టిఫికెట్లు జతచేశాను. అయినా నా కూతుర్ని చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నారు, ”అని సూరత్ నగరంలో ఇళ్లల్లో పాకిపనిచేసే

జాన్విబెన్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నా కూతురికి మంచి చదువు చెప్పించాలని ఆశించాను. కానీ నా ఆదాయానికి అది కష్టం," అని బాధగా చెప్పారు.

పెరిగిన అప్లికేషన్లు..

రాష్ట్ర విద్యా శాఖ 9,741 ప్రైవేట్ పాఠశాలల్లో 93,860 సీట్లను RTE కోటా కింద నోటిఫై చేసింది. గుజరాత్ అంతటా 93,860 సీట్లలో 86,274 సీట్లు మొదటి రౌండ్లో భర్తీ అయ్యాయి. వీటిలో 13,761 దరఖాస్తులను తిరస్కరించారు. అవసరమైన సర్టిఫికెట్లు లేవని మరో 49,470 అప్లికేషన్లను రిజెక్టు చేశారు. మిగిలిన సీట్లకు ఈ ఏడాది మే 16న సెకండ్ రౌండ్ అడ్మిషన్ ప్రారంభమైంది.

ఈ సంవత్సరం RTE కింద 2.5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. గత సంవత్సరం ఈ సంఖ్య కేవలం 40వేలు మాత్రమే. ఆదాయ పరిమితి రూ. 1.5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచడంతో దరఖాస్తుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది.

ఈ చర్య EWS కుటుంబాలపై ఒత్తిడిని పెంచింది. వారికి కేటాయించిన సీట్లకు పోటీ ఎక్కువైంది.

RTE చట్టం, అడ్మిషన్ సమయంలో ఏ సర్టిఫికెట్లు సమర్పించాలన్న వివరాలపై విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తే బాగుంటుందని ఆనంద్ జిల్లాకు చెందిన RTE కార్యకర్త జనిసర్ షేక్ అభిప్రాయపడ్డారు. 

Tags:    

Similar News