జుబీన్ భార్యకు పోస్టుమార్టం రిపోర్టు అందజేసిన SIT అధికారులు
అస్సాం ప్రముఖ గాయకుడిని విషమిచ్చి చంపారంటున్న గార్గ్ బృందంలోకి సభ్యులు
ఇటీవల అనుమానాస్పదంగా మృతిచెందిన అస్సాం(Assam) ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్(Zubeen Garg) రెండో పోస్టుమార్టం(Post-mortem) నివేదికను ప్రత్యేక దర్యాప్తు బృందం (S.I.T) అధికారులు ఆయన భార్య గరిమాకు శనివారం అందజేశారు. సెప్టెంబర్ 23న గౌహతి మెడికల్ కాలేజీలో ఆయనకు రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో నిర్వహించిన మొదటి పోస్ట్‌మార్టం నివేదిక కూడా గురువారం గార్గ్ కుటుంబసభ్యులకు అందింది. అయితే పోస్ట్ మార్టం నివేదికను బయటపెట్టాలా? వద్దా? అన్నది గరిమా ఇష్టమని బృందంలోని ఓ అధికారి తెలిపారు.
నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ పేరిట సింగపూర్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రదర్శనకు గార్గ్ వెళ్లారు. సెప్టెంబర్ 19న ఆయన సముద్రంలో ఈత కొడుతూ చనిపోయారు. ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించారు. అలాగే ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు.
గార్గ్ అనుమానాస్పద మృతి కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఉత్సవ నిర్వాహకుడు శ్యామ్‌కాను, గార్గ్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మతో పాటు జుబెన్ బ్యాండ్ సభ్యులు శేఖర్ జ్యోతి గోస్వామి, అమృత్ ప్రభా మహంతను అరెస్టు చేశారు.
పోలీసుల విచారణలో శేఖర్ జ్యోతి గోస్వామి.. గార్గ్ గురించి, అలాగే ఆయన మేనేజర్ శర్మ గురించి పలు విషయాలు చెప్పారు.
‘‘సింగపూర్(Singapore)లో గార్గ్ మరణానికి కొన్ని గంటల ముందు మేనేజర్ శర్మ ప్రవర్తనలో మార్పు కనిపించింది. సైలర్‌ను తప్పించి ఓడ నియంత్రణను శర్మ తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఫలితంగా సముద్రం మధ్యలో ఓడ ప్రమాదకరంగా ఊగింది. అందులో ఉన్నవాళ్లమంతా భయపడిపోయాం. ఓడలోకి ఎలాంటి పానీయాలు తీసుకురావద్దని, తానే వాటిని సమకూరుస్తానని అస్సాం అసోసియేషన్ (సింగపూర్) సభ్యుడు, ఎన్నారై తన్మోయ్ ఫుకాన్‌తో శర్మ అన్నాడు. గార్గ్ ఓ ట్రైన్డ్ స్విమ్మర్. నాకు, శర్మకు ఈత నేర్పింది కూడా ఆయనే. జుబెన్ నీట మునిగి చనిపోయే ఛాన్సే లేదు. గార్గ్ ఊపిరి ఆడక మునిగిపోతున్న సమయంలో శర్మ "జబో దే, జబో దే" ("అతన్ని వెళ్ళనివ్వండి, వెళ్ళనివ్వండి") అని అరవడం వినిపించింది. ఓడ వీడియోలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని కూడా శర్మ చెప్పాడు. గార్గ్ నోరు, ముక్కు నుంచి నురగ వస్తున్నపుడు.. శర్మ దానిని "యాసిడ్ రిఫ్లక్స్" గా కొట్టిపడేశాడు. ఎవరూ ఆందోళన పడాల్సిందేమీలేదని చెప్పారు. శర్మ నిర్లక్ష్యం వల్లే గార్గ్ చనిపోయాడు. శర్మ, మహంత కలిసి గార్గ్ మర్డర్‌కు ప్లాన్ చేశారు. హత్య చేయడానికి సింగపూర్‌ను ఎంచుకున్నారు. ’’ అని విచారణలో చెప్పారు. కాగా శేఖర్ జ్యోతి గోస్వామి ఆరోపణలను విచారణ సమయంలో శర్మ, మహంత తోసిపుచ్చారు.