కోల్‌కతా ఘటనలో ముగ్గురు సస్పెండ్

హింసాత్మక ఘటనలో సుమారు వెయ్యి మందిలో పురుషులు, మహిళలు ఉన్నట్లు గుర్తించామని, వీరిలో చాలా మంది ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు పారిపోయారని పోలీసులు కోర్టుకు చెప్పారు.

Update: 2024-08-21 08:46 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కర్ హాస్పిటల్‌ ఘటనకు సంబంధించి కోల్‌కతా పోలీసులు మంగళవారం తమ సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు. ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఎసీపీలు), ఒక ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు.

సస్పెన్షన్ ఎందుకు?

ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన తర్వాత కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం ఆందోళన ముసుగులో కొందరు.. అత్యాచారం జరిగిన సెమినార్ గదికి సమీపంలో విధ్వంసం సృష్టించారు. మరోవైపు వైద్యురాలి కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు మంగళవారం ఆసుపత్రి ఆస్తుల విధ్వంసానికి సంబంధించి కోల్‌కతా పోలీసులు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హింసాత్మక ఘటనకు పాల్పడిన సుమారు వెయ్యి మందిలో పురుషులు, మహిళలు ఉన్నట్లు గుర్తించామని, వీరిలో చాలా మంది ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు పారిపోయారని పోలీసులు కోర్టుకు చెప్పారు. నేరస్తులు సోషల్ మీడియా ద్వారా సమాచారం చేరవేసుకుని, అదే రోజు రాత్రి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రి వద్దకు వచ్చారని పేర్కొన్నారు. సాల్ట్ లేక్, కెస్టోపూర్, అమ్హెర్స్ట్ స్ట్రీట్, ఇతర ప్రాంతాల నుంచి బస్సులు, ట్రక్కులు, ఇతర వాహనాలలో ఆసుపత్రికి వద్దకు గ్రూపులుగా వచ్చారని తెలిపారు. సీసీ ఫుటేజీని పరిశీలించి ఇప్పటికే 37 మందిని అరెస్టు చేశామని, ఘటనలో కీలకంగా వ్యవహరించిన మరో 10 మందిని గుర్తించామని చెప్పారు. హింసాకాండను ప్లాన్ చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అయితే ఆగస్టు 22లోగా కోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉన్నందున పేర్లు బయట పెట్టడం లేదని పోలీసులు తెలిపారు. అయితే ఆసుపత్రిలో నేరం జరిగిన స్పాట్ చెక్కుచెదరకుండా ఉందని కోర్టుకు చెప్పారు. 

Tags:    

Similar News