‘వారికి పేదల గురించి చర్చ విసుగుగా అనిపించొచ్చు’

ఢిల్లీలో రూపాయి విడుదలైతే, కేవలం 15 పైసలే గ్రామాలకు చేరుతుందని మాజీ పీఎం ‘మిస్టర్ క్లీన్’ అన్నారు. మరీ ఆ 15 పైసలు ఎవరికి చేరాయో ఊహించగలరా? - ప్రధాని మోదీ;

Update: 2025-02-04 13:07 GMT

ప్రధాని మోదీ మంగళవారం (ఫిబ్రవరి 4) లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతా తీర్మానంపై ప్రసంగాన్ని ప్రారంభిస్తూనే.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం రాహుల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసిన విషయం తెలిసిందే.

"పేదల గుడిసెల్లో ఫోటో సెషన్‌‌ను హాబీగా భావించే వారికి పార్లమెంటులో నిరుపేదల గురించిన చర్చ విసుగుగా అనిపించవచ్చు," అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ మాటలు రాహుల్ గాంధీనుద్దేశించి చేసినవి.

మాజీ మన్మోహన్ సింగ్‌ గురించి కూడా మోదీ(PM Modi) మాట్లాడారు. "మన దేశానికి ఒక పీఎం ఉండేవారు. ఆయనను ‘మిస్టర్ క్లీన్’ అని పిలిచేవారు. ఢిల్లీలో రూపాయి విడుదలైతే, కేవలం 15 పైసలు మాత్రమే గ్రామాలకు చేరుకుందని అన్నారు. ఆ సమయంలో గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఒకే పార్టీ అధికారంలో ఉంది. మరీ ఆ 15 పైసలు ఎవరికి చేరాయో ఎవరైనా ఊహించగలరా?" అని మోదీ అన్నారు.

రాహుల్ వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు ఏమన్నారంటే..

రాహుల్ గాంధీ(Rahul Gandhi) సోమవారం లోక్‌సభలో చేసిన ప్రసంగంపై బీజేపీ (BJP) తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. "ఇండియా" కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టాభిషేకానికి విదేశాంగ మంత్రిని అమెరికాకు పంపే అవసరం వచ్చేది కాదు" అని రాహుల్(Rahul) వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ(BJP) తీవ్రంగా స్పందించింది. ‘‘విదేశాంగ మంత్రి అమెరికా వెళ్లి ప్రధానికి ఆహ్వానం కోరారని మీరు ఎలా చెప్పగలరు? " అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గట్టిగా ప్రశ్నించారు.

రాహుల్ తన ప్రసంగంలో మరో ఆరోపణ కూడా చేశారు. ప్రధాని మోదీ భారత భూభాగంలో చైనా దళాలు లేవని చెబుతున్నారని, కానీ భారత సైన్యం మాత్రం ఆయన స్టేట్‌మెంట్ అంగీకరించలేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కూడా బీజేపీ నేతల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ తన ప్రసంగంలో చైనా పేరును 35 సార్లు ప్రస్తావించారని, ఇది చైనాపై ఆయన ఉన్న ప్రేమను సూచిస్తుందని విమర్శించారు.

అవన్నీ ఆరోపణలే..బీజేపీ

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా.. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయానికి సుమారు 70 లక్షల మందిని కొత్త ఓటర్ల జాబితాలో చేర్చారని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే కౌంటర్ ఇచ్చింది. తప్పుడు ఆరోపణలు చేసి తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నారని, ప్రతిపక్ష నేత ఇకనైనా బాధ్యతగా వ్యవహరించాలని వ్యవహరించాలని చురకలంటించింది. 

Tags:    

Similar News