పంజాబ్‌లో AAPకు 'ఆపరేషన్ లోటస్' భయం?
తమతో 30 మంది చీపురు పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కాంగ్రెస్ పార్టీ పంజాబ్ ప్రతిపక్ష నేత పర్తాప్ సింగ్ బాజ్వా వ్యాఖ్యలు సీఎం భగవంత్‌ను భయపెడుతున్నాయా?;
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Polls)లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. మొత్తం 70 స్థానాలకు కేవలం 22 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ 48 స్థానాలకు దక్కించకుని అధికార పగ్గాలు చేపట్టనుంది.
పంజాబ్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశం..
ఢిల్లీ ఎన్నికల ప్రభావం ఆప్ (AAP) పాలిత రాష్ట్రం పంజాబ్‌పై ప్రభావం చూపకుండా ఉండేందుకు పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మంగళవారం (ఫిబ్రవరి 11) పంజాబ్ సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann)తో పాటు ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. సుమారు 30 మంది AAP ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు ప్రకటించడంతో కేజ్రీవాల్ ఈ సమావేశం పెడుతున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ సమావేశం ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు మాత్రమే ఏర్పాటు చేసినట్టు ఆప్ నేతలు చెబుతున్నారు. "ఆపరేషన్ లోటస్"లో భాగంగా తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని బీజేపీపై AAP గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
అందరూ హాజరుకావాల్సిందే..
మంగళవారం అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని ఎమ్మెల్యేలంతా సమావేశానికి హాజరుకావాలని సీఎం భగవంత్ మాన్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ఈ సమావేశం ఢిల్లీలోని పంజాబ్ సీఎం అధికారిక నివాసం కపుర్తలా హౌస్‌లో జరగనుంది. గత మూడు రోజులుగా ఢిల్లీలో తిష్టవేసిన భగవంత్ మాన్ సోమవారం చండీగఢ్ చేరుకున్నారు. సోమవారం జరగాల్సిన క్యాబినెట్ సమావేశాన్ని ఫిబ్రవరి 13కి వాయిదా వేశారు. ఈ సమావేశం నాలుగు నెలల తర్వాత జరుగుతున్న మొదటి క్యాబినెట్ భేటీ కావడం గమనార్హం.
ఇక పంజాబ్‌పైనే దృష్టి..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆప్ నాయకత్వం పూర్తిగా పంజాబ్‌పై దృష్టి కేంద్రీకరించిందని తెలుస్తోంది. అందులో భాగంగానే మంగళవారం (ఫిబ్రవరి 11న) ఢిల్లీలో జరిగే సమావేశంలో కేజ్రీవాల్ పంజాబ్ ఎమ్మెల్యేలకు కొన్ని సూచనలు చేస్తారని సమాచారం. ప్రలోభాలకు లొంగకుండా.. ప్రజల్లో మమేకమై పార్టీ బలోపేతానికి పూనుకోవాలని చెప్పే అవకాశం ఉంది.
కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అవుతారా?
AAP ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్న ప్రతిపక్ష నేత పర్తాప్ సింగ్ బాజ్వా వ్యాఖ్యలు చీపురు పార్టీలో గుబులు పుట్టిస్తున్నాయి. అంతటితో ఆగక, పంజాబ్ సీఎం పదవిపై కేజ్రీవాల్ కన్నేశారని ఆయన సంచలన కామెంట్ చేశారు. ఒక హిందువు కూడా సీఎం కావొచ్చని ఇటీవల AAP పంజాబ్ అధ్యక్షుడు అరోరా వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి హిందువా? సిక్కా? అని చూడకుండా.. సీఎం పదవికి కావాల్సిన అర్హతలు ఉంటే చాలని పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు ముందు ఆయన ఈ ప్రకటన చేశారు. దీంతో AAP అధినాయకత్వం కేజ్రీవాల్‌ను పంజాబ్ సీఎం చేయడానికి బాటలు వేస్తోందన్న సంకేతాలనిచ్చింది.
లుధియానా నుంచి కేజ్రీవాల్ పోటీ..
పంజాబ్‌లోని లుధియానాలో AAP ఎమ్మెల్యే మరణించడంతో, ఆ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. అక్కడి నుంచి కేజ్రీవాల్ అసెంబ్లీలోకి ప్రవేశించి సీఎం అవుతారని బాజ్వా అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో అధికారం కోసం AAP లోనే సీఎం భగవంత్ మాన్ వర్గం, ఢిల్లీ నేతల మధ్య విభేదాలు తలెత్తవచ్చని బాజ్వా జోష్యం చెప్పారు.
అసంతృప్తి సెగలు రగులుతాయా?
ఢిల్లీలోAAP పరాజయాన్ని గమనించిన పంజాబ్ కాంగ్రెస్.. ఇక తమ రాష్ర్టంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటుంది. AAPలో అసంతృప్తి సెగలు రగిలితే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించే యోచనలో ఉందని పార్టీ వర్గాల సమాచారం.
దీంతో పాటుగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై మరింత దృష్టిపెట్టాలని భావిస్తోంది. ముఖ్యంగా వ్యవసాయం, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనుంది.
టార్గెట్ ఫిక్స్ చేసిన కాంగ్రెస్..
కాంగ్రెస్ ఇకపై పంజాబ్ AAP ప్రభుత్వంపై దాడిని ముమ్మరం చేయనుంది. నెరవేర్చని హామీలు, ఆర్థిక సంక్షోభం వంటి అంశాలపై విమర్శనాస్త్రాలు సంధించనుంది. AAP పాలనను అసమర్థంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించనుంది.
పుంజుకున్న కాంగ్రెస్..
2022 అసెంబ్లీ ఎన్నికల్లో AAP 117 స్థానాల్లో 92 గెలుచుకుని పంజాబ్‌లో ఘన విజయం సాధించింది. అయితే మూడేళ్ల వ్యవధిలోనే ఆ పార్టీ బలహీనపడినట్లు కనిపిస్తోంది. ఇది 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా స్పష్టమైంది. 13 లోక్‌సభ స్థానాల్లో AAP కేవలం 3 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 7 సీట్లు గెలుచుకుంది.