కొత్త పరీక్ష తేదీలను ప్రకటించిన ఎన్‌టీఏ ..
ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలతో జాతీయ పరీక్షల సంస్థ(NTA) ఇటీవల రద్దుచేసిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు శుక్రవారం రాత్రి కొత్త తేదీలను ప్రకటించింది.
ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలతో జాతీయ పరీక్షల సంస్థ(NTA) ఇటీవల రద్దుచేసిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు శుక్రవారం రాత్రి కొత్త తేదీలను ప్రకటించింది. జులై 10న నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎన్‌సీఈటీ), జూలై 25 నుంచి 27 తేదీల్లో సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్, ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 4 తేదీ మధ్యలో యూజీసీ-నెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.
నీట్ ప్రశ్నప్రతం లీక్ అయ్యిందని అంగీకరించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ..ఈ వ్యవహారంపై సీబీఐ విచారిస్తోందని చెప్పారు.
మెడికల్ ప్రవేశ పరీక్ష NEET-UG, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో.. NTA ద్వారా పరీక్షలను పారదర్శకంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్రం గత వారం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
ఉభయ సభల్లో చర్చకు ప్రతిపక్షాల పట్టు..
ఇటు పార్లమెంటులోనూ NEET ప్రశ్నపత్రం లీకేజీపై ప్రతిపక్షాలు పట్టుబట్టిన విషయం తెలిసిందే. కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నందున దీనిపై తక్షణమే చర్చకు అనుమతించాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. రాష్ట్రపతి ముర్ముకు ధన్యవాదాల తెలిపే తీర్మానం తర్వాత చర్చిద్దామని స్పీకర్ బదులిచ్చారు. అయినా విపక్షాలు పట్టు వీడకపోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య సభ సోమవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.