యూపీలో మరోసారి ఏనుగు పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందా?
కాన్షీరామ్ జయంతి నాడు లక్నోలో భారీ ర్యాలీ నిర్వహించబోతున్న మాయావతి
By : The Federal
Update: 2025-10-07 11:36 GMT
శిల్పిసేన్
ఉత్తరప్రదేశ్ లో ఒకప్పుడూ ఒక వెలుగు వెలిగిన బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కొంతకాలం క్రితం తన ప్రాభవం కోల్పోయింది. లోక్ సభ ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ ఏర్పాటు చేసిన పీడీఏ(పిచ్డా- వెనకబడిన తరగతులు), దళితులు, అల్ప సంఖ్యాక్(మైనారిటీలు) కలయిక తరువాత ఆ పార్టీ ఉనికి కే సవాల్ ఎదురయింది.
అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల నుంచి గరిష్ట ప్రయోజనం పొందుతున్నారని చెప్పడం ద్వారా కూడా బీజేపీ దళిత ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. అటువంటి పరిస్థితిలో పార్టీ అధ్యక్షురాలు మాయావతి అక్టోబర్ 9న మెగా ర్యాలీ నిర్వహించడానికి సిద్దమయ్యారు. ఆరోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షీరామ్ వర్ధంతి.
ర్యాలీకి 5 లక్షలు..
లక్నోలోని దళితుల ఆత్మగౌరవానికి అంకితం చేయబడిన కాన్షీరామ్ స్థల్ వద్ద యూపీ మాజీ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ర్యాలీ అనేక విధాలుగా ప్రత్యేకమైనదిగా ఉండబోతోంది. 2012 లో విచ్చిన్నమైన బీఎస్పీ ప్రాభావాన్ని తిరిగి సాధించడానికి మాయవతి ప్రయత్నాలు చేస్తోంది.
ఇదే సమయంలో సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీని.. బీజేపీకి బీ టీంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీకి ఈ సవాల్ పరిస్థితిలో మాయావతి ఈ ర్యాలీలో తన రాజకీయ భవిష్యత్ ను సూచించే అవకాశం ఉంది.
ఈ ర్యాలీకి దాదాపు ఐదు లక్షలుగా సమీకరించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. దీనిని పునరాగమనానికి సంకేతంగా చూస్తున్నారు. యూపీ అసెంబ్లీకి ఎన్నికల ముందు దళిత, ఓబీసీ, మైనారిటీ ఓటు బ్యాంకులను బలోపేతం చేసే వ్యూహంలో ఈ ర్యాలీ భాగమవుతుందని భావిస్తున్నారు.
ఈ ర్యాలీ ప్రకటన తరువాత బీఎస్పీ పార్టీ ఇతర అన్ని పనులను, ప్రచారాలను నిలిపివేసింది. ఈ ర్యాలీకి ప్రజలను సమీకరించాలని పార్టీ నాయకులందరినీ ఆదేశించింది.
బీఎస్పీ పార్టీ నేతల ప్రకారం.. పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. లక్నోతో సహ అనేక జిల్లాల్లో గోడలు పాత శైలిలో నీలం రంగులో పెయింట్ చేయబడ్డాయి. ప్రజలు లక్నో కు చేరుకోవాలని కోరారు. ‘‘9 అక్టోబర్ లక్నో చలో’’ అనే నినాదంతో బ్యానర్లు, పోస్టర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి.
బీఎస్పీ భవిష్యత్ కార్యాచరణ..
ఈ ర్యాలీలో మాయావతి ప్రసంగం బీఎస్పీ భవిష్యత్ కార్యాచరణకు స్పష్టమైన సంకేతాలను అందిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దళిత+ ముస్లిం సూత్రాన్ని అనుసరిస్తుందా లేదా సర్వజన్ హితాయ, సర్వజన్ సుఖాయ( అందరికి సంక్షేమం, అందరి ఆనందం) అనే సామాజిక ఇంజనీరింగ్ సూత్రాన్ని అనుసరిస్తుందా అనే అంశంపై ఓటర్లు సందేశం ఇచ్చే అవకాశం ఉంది.
2022 అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ పాతాళానికి పడిపోయింది. పార్టీ అభ్యర్థులలో కేవలం ఒక్కరంటే ఒక్కరే గెలిచారు. తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో పార్టీకి కనీసం ఓటింగ్ శాతం కూడా రాలేదు.
అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలలో 19.43 శాతం ఓట్లు రాగా, లోక్ సభ ఎన్నికల నాటికి అది కేవలం 9.35 శాతానికి పడిపోయింది. ఒకప్పుడు దళిత వాదానికి కేంద్రంగా ఉన్న బీఎస్పీ ఇప్పుడు దాని ప్రాభవం కోల్పోయింది. ఎస్పీ అనుసరిస్తున్న పీడీఏ నినాదంతో దళితులు ఆ పార్టీకి మద్దతుగా ఉన్నారు.
బీజేపీ బీ టీం గా ప్రత్యర్థులు చేస్తున్న రాజకీయాలను కూడా మాయావతి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఆమె ర్యాలీలో ప్రసంగం కీలకమవుతుంది. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ కు ఇటీవల ఇచ్చిన అసైన్ మెంట్ పై మాయవతి తన వైఖరిని కూడా స్పష్టం చేసే అవకాశం ఉంది.
పీడీఏ నుంచి చంద్రశేఖర్ వరకూ..
లోక్ సభ ఎన్నికలలో ఎస్పీ ఏకంగా 37 సీట్లు సాధించి దళిత ఓట్లపై పట్టు సాధించింది. అయితే ఆజాద్ సమాజ్ పార్టీకి చెందిన చంద్రశేఖర్ నాగినా సీట్ లో విజయం సాధించడం, దళిత రాజకీయాలలో కొత్త నాయకుడిగా ముద్ర పడింది.
చంద్రశేఖర్ దూకుడు, రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తుందనే ఆరోపణలు, ఎస్పీ- కాంగ్రెస్ కూటమిని బలపరిచి దళిత ఓట్లన్నీ ఎస్పీ వైపు మొగ్గాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ అంశంపై మాయవతి ఎటువంటి వైఖరి తీసుకుని మాట్లాడతారు.. ఎలా దూకుడుగా వ్యవహరిస్తారనే అంశంపై బీఎస్పీ భవితవ్యం ఆధారపడి ఉంది.