అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయను: ప్రశాంత్ కిషోర్
సడన్ గా ప్లేట్ మార్చిన ఎన్నికల వ్యూహాకర్త
By : Praveen Chepyala
Update: 2025-10-15 07:03 GMT
ఇన్నాళ్లు ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన ఎన్నికల వ్యూహాకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రూట్ మార్చారు. తాను రాబోయో అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేయబోవడం లేదని ప్రకటించారు.
ఈ నిర్ణయం పార్టీ గొప్ప ప్రయోజనం కోసం తీసుకున్నదని ఆయన పేర్కొన్నారు. పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మా పార్టీకి 150 కంటే తక్కువ సీట్లు వస్తే ఓటమి భావిస్తా’’ అన్నారు.
‘‘బీహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ గెలిస్తే అది దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. దేశ రాజకీయాలను దిక్సూచీ వేరే దిశలోకి మారుస్తుంది’’ అని కిషోర్ నొక్కి చెప్పారు. బీహార్ ఎన్నికలు నవంబర్ 6, నవంబర్ 11న రెండు తేదీలలో జరగబోతున్నాయి. నవంబర్ 14 న ఫలితాలు విడుదల కానున్నాయి.
ఏం కాదు.. కిశోర్..
‘‘నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాకూడదని పార్టీ నిర్ణయించింది. అందుకే తేజస్వీ యాదవ్ పై రాఘోపూర్ నుంచి మరో అభ్యర్థిని పార్టీ ప్రకటించింది. ఇది పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మేము ఇది తీసుకున్న నిర్ణయం. నేను పోటీ చేస్తే అది నన్ను అవసరమైన సంస్థాగత పని నుంచి దూరం చేస్తుంది’’ అని కిషోర్ అన్నారు.
ఎన్నికలలో తన పార్టీ అవకాశాల గురించి మీ అభిప్రాయం ఏమిటని అడిగినప్పుడు ‘‘మేము బాగా గెలుస్తాము లేదా ఘోరంగా ఓడిపోతాము 150 సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని నేను రికార్డులలో చెబుతున్నాను. మధ్యలో ఏమి వచ్చే అవకాశం లేదు’’ అని సమాధానం ఇచ్చారు.
ఎన్నికలలో హంగ్ వస్తే ఎవరికి మద్దతిస్తారని ప్రశ్నించగా తాము ఎన్డీఏ లేదా ఇండి బ్లాక్ ఎవరికి మద్దతు ఇవ్వమని, అధికారం మాదే అని ధీమా వ్యక్తం చేశారు.
‘‘150 కంటే తక్కువ సీట్లు, అది 120, 130 వచ్చినా మాకు ఓటమి కిందే లెక్క. మనం బాగా చేస్తే బీహార్ ను మార్చే అధికారం మనకు ఉంటుంది. దేశంలోని అత్యంత అభివృద్ది చెందిన 10 రాష్ట్రాలలో ఒకటిగా దానిని పరిగణించేలా చేస్తుంది. మనం తగినంతగా రాణించకపోతే ప్రజలు మనపై తగినంత విశ్వాసం చూపలేదని అర్థం, మనం మన రాజకీయాలను కొనసాగించాలి’’ అని ఆయన అన్నారు.