కల్తీ మద్యం మరణాల వెనక ఎవరున్నా వదలం: పంజాబ్ సీఎం
అమృత్ సర్ లో కల్తీ మద్యం తాగి 21 మంది మృతి, ఆస్పత్రిలో చేరిన మరో 10 మంది;
By : Praveen Chepyala
Update: 2025-05-14 08:11 GMT
కల్తీ మద్యం తాగి 21 మంది మరణించిన ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. కల్తీ మద్యం అమ్మకాలలో పాల్గొన్న ఎవరిని తమ ప్రభుత్వం విడిచిపెట్టదని, వాటిని హత్యలుగా పరిగణిస్తామన్నారు. పంజాబ్ లోని అమృత్ సర్ జిల్లాలోని కల్తీ మద్యం సేవించి 21 మంది మరణించారు. దాదాపు పది మంది ఆస్పత్రి పాలయ్యారని అధికారులు తెలిపారు.
600 లీటర్ల మిథనాల్..
పంజాబ్ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మంగళవారం నాడు కల్తీ మద్యం విషాదానికి సంబంధించిన 6 వందల లీటర్ల మిథనాల్ ను స్వాధీనం చేసుకున్నారు. మిథనాల్ అనేది తేలికైన రంగులేని సేంద్రీయ రసాయన సమ్మేళనం. ఆల్కహాల్ కు దీనిని ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. మత్తు పదార్థాలకు వీటిని కలుపుతూ ఉంటారు. ఇది ఇథనాల్ కు ప్రత్యామ్నాయంగా చట్టవిరుద్దంగా ఆల్కాహాలిక్ పానీయాలకు వాడుతుంటారు.
స్వాధీనం చేసుకున్న మిథనాల్ కు అమృత్ సర్ లో జరిగిన కల్తీ మద్యం మరణాలకు సంబంధం ఉందని అనుమానిస్తున్నట్లు సీనియర్ సూపరింటేండ్ ఆఫ్ పోలీస్ (పాటియాల) వరుణ్ శర్మ తెలిపారు.
బాబా బందా సింగ్ బహదూర్ శంభూ- బానూర్ రోడ్డులోని టెప్లా పోలీస్ పోస్ట్ సమీపంలో ఒక ట్రక్కు నుంచి ఈ దొంగ సరుకు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన సీఎం..
కల్తీ మద్యం మరణాలు ఉత్తరాది రాజకీయాలలో తీవ్ర గందరగోళం నింపాయి. దీనికి ఆప్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. భంగలి, పటల్ పురి, మరారీ కలాన్, తల్వాండీ ఖుమ్మన్, కర్నాలా, భంగ్వాన్, తేరేవాల్ గ్రామాల్లో ఈ మరణాలు సంభవించాయి.
చనిపోయిన బాధిత కుటుంబాలను సీఎం సందర్శించి, సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. బాధితుల పిల్లల చదువులకు అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఉద్యోగాలు, ఇతర విషయాలలో సాధ్యమైన ప్రతిసహాయం కూడా ఈ కుటుంబాలకు అందిస్తామని మాన్ చెప్పారు.
మరణాలు కాదు.. హత్యలు: ముఖ్యమంత్రి
ఈ మరణాలు ప్రమాదాలని కాకుండా హత్యల్లా చూస్తామని, కొంతమంది వ్యక్తుల దురాశ కారణంగా సంభవించిన హత్యలని మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు హత్య నుంచి తప్పించుకోలేరని అన్నారు. శక్తివంతమైన రాజకీయ నాయకుల రాజకీయ ప్రొత్సాహం లేకుండా ఈనేరం జరిగేది కాదని ముఖ్యమంత్రి అన్నారు. ఈ హత్య కోణాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు.
ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తితో సహ పదిమందిని అరెస్ట్ చేశామని దీని వెనక ఉన్న అందరి వ్యక్తులను పోలీసులు గుర్తించారని ఆయన పేర్కొన్నారు.
‘‘నేను చాలా స్ఫష్టంగా ఒక విషయం చెబుతున్నాను. నిందితులకు కఠినమైన శిక్షను విధించడం ద్వారా అభాగ్యుల కుటుంబాలకు న్యాయం జరిగేలా నా ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని మాన్ అన్నారు. ఈ నేరానికి ఢిల్లీ వరకూ సంబంధాలు ఉన్నాయి. ఈ నేరంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం కటకటాల వెనక్కి నెట్టివేస్తుందని మాన్ అన్నారు.
మిథనాల్ ను ఎలా పట్టుకున్నారు..
అమృత్ సర్ లో జరిగిన విషాద సంఘటన తరువాత డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(బోర్డర్ రేంజ్) ఢిల్లీ నుంచి పంజాబ్ కు అనుమానిత మిథనాల్ రవాణా చేస్తున్నారని నిఘా సమాచారం అందుకున్నారు.
పోలీసులు, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో టెప్లా సమీపంలో ట్రక్కును అడ్డగించి ఇతర వస్తువులతో పాటు ఉన్న 600 లీటర్ల ఉన్న మూడు మిథనాల్ డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. ట్రక్ డ్రైవర్ ను అరెస్ట్ చేశామని, దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఈ సరుకు గమ్యస్థానానికి చేరుకుని ఉంటే వందలాది మంది అమాయకుల ప్రాణాలు పోయేవని అని ఆయన అన్నారు.
10 మంది అరెస్ట్..
పంజాబ్ లోని అమృత్ సర్ జిల్లాలోని మజితలో కల్తీ మద్యం తాగి కనీసం 21 మంది మరణించగా, 10 మంది ఆస్పత్రి పాలయ్యారని అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది రోజువారీ కూలీలు ఉన్నారు. ఈ ఘటనలో కీలక నిందితుడితో పాటు పదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.