అమెరికా మధ్యవర్తిత్వం చేయలేదు: భారత విదేశాంగమంత్రి

పాకిస్తానే అమెరికాను కోరగా, మీరే వెళ్లి భారత్ తో నేరుగా మాట్లాడుకోందని సూచించింది: జైశంకర్;

Update: 2025-05-27 06:31 GMT
భారత విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్

ఆపరేషన్ సిందూర్ తరవాత భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగిన సాయుధ ఘర్షణ నివారణలో యూఎస్ ఎలాంటి మధ్యవర్తిత్వం చేయలేదని, ఇరుపక్షాల డీజీఎంల ద్వారా మాత్రమే కాల్పుల విరమణ ఒప్పందం అమలులోని వచ్చాయని భారత్ మరోసారి స్పష్టం చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని పదేపదే చెప్పుకుంటున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ మేరకు స్పష్టమైన వివరణ ఇచ్చారు.
సోమవారం ఆయన పార్లమెంటరీ ప్యానెల్ ను ఉద్దేశించి మాట్లాడారు. పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు సైనిక చర్యను నిలిపివేయాలనే నిర్ణయం కేవలం రెండు దేశాలు మాత్రమే తీసుకున్నాయని చెప్పారు.
పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన దాడుల గురించి డీజీఎంఓ పాకిస్తాన్ కు తెలియజేసిందని చెప్పారు. ఉగ్రవాదులందరిని హతమార్చిన విషయం ముందు పాకిస్తాన్ చెప్పినట్లు పేర్కొన్నారు.
అమెరికా మధ్యవర్తిత్వం చేయలేదు
న్యూఢిల్లీలో విదేశీ వ్యవహరాల సంప్రదింపుల కమిటీ సభ్యులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. పాకిస్తాన్ డీజీఎంఓ దాడులను ఆపమని కోరిన తరువాత ఆపరేషన్ సిందూర్ కు విరామం ఇచ్చినట్లు, రెండింటి మధ్య అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వం చేయలేదని అన్నారు.
ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడానికి ముందే భారత్, పాకిస్తాన్ సమాచారం ఇచ్చిందని ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ ఆరోపణలను ఆయన తిరస్కరించారు.
డీజీఎంఓ స్థాయి చర్చలు మాత్రమే
కొంతమంది రాజకీయ నాయకులు తన ప్రకటనను పూర్తిగా అర్థం చేసుకోకుండా తప్పుడు అర్థాలతో విమర్శలు చేస్తున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీకి చురకలంటించారు. ఇలాంటి రాజకీయాలు చేయడం దురదృష్టకరమని అన్నారు. పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడినట్లు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు.
దేశాల డీజీఎంల స్థాయిలో మాత్రమే చర్చలు జరిగాయని, మరే ఇతర భారత అధికారి పాకిస్తాన్ వైపు మాట్లాడలేదని మంత్రి సమావేశంలో ఎంపీలకు చెప్పారు.
పాకిస్తాన్, అమెరికా సాయం కోరింది
భారత్ చేస్తున్న సైనిక కార్యకలాపాలను నిలిపివేయడంలో పాకిస్తాన్ అమెరికా సాయం కోరిందని, అయితే అమెరికా మాత్రం భారత్ తో నేరుగా మాట్లాడుకోవాలని పాకిస్తాన్ కు సూచించదని జైశంకర్ ఎంపీలకు చెప్పారు.
పాకిస్తాన్ చర్చలు జరపాల్సిందిగా అమెరికా కోరుకుందని, కానీ ఉగ్రవాదం, చర్చలు ఒకే వేదికపై జరగవనే విషయాన్ని భారత్ స్పష్టం చేసిందని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ కు విరామం, అమెరికా జోక్యం గురించి సమావేశంలో ఎంపీలు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. పాకిస్తాన్ కాల్పులు జరిపితే తిరిగి భారత్ సైతం కాల్పులు జరుపుతుందని డీజీఎం తెలియజేసినట్లు చెప్పారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా చేసుకున్న దాడులు పాకిస్తాన్ దళాల నైతిక స్థైర్యాన్ని కూడా దెబ్బతీశాయని ఆయన అన్నారు.
సమష్టి బాధ్యతకు పిలుపునిచ్చిన జైశంకర్
ఆపరేషన్ సిందూర్ తాత్కాలిక విరామం మాత్రమే అని భారత ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందని జైశంకర్ సమావేశంలో అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ను ఎండగట్టడానికి అన్ని పార్టీల ఎంపీల సహకారాన్ని మంత్రి కోరినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అందుకే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఐక్య సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ప్రభుత్వం వివిధ దేశాలకు బహుళ పార్టీల ప్రతినిధులను పంపిందని ఆయన అన్నారు. పాకిస్తాన్ ప్రచారానికి మోసపోవద్దని, పొరుగుదేశం వ్యాప్తి చేసే పుకార్లను నమ్మవద్దని మంత్రి ఎంపీలను కోరారు.
ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడంలో భారత్ వైపు అన్ని దేశాలు నిలిచినప్పటికీ చైనా, టర్కీ, అజార్ బైజాన్ వంటి దేశాలు పాకిస్తాన్ వైపు నిలిచాయని ఆయన గుర్తు చేశారు.
పంజాబ్ కు మాదక ద్రవ్యాల ముప్పు
సింధు జలాల సమస్యకు సంబంధించి భారత్ కొన్ని చర్యలు తీసుకుందని , త్వరలో ఏదో మంచి జరుగుతుందని విదేశాంగమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. స్వర్ణ దేవాలయంపై దాడికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను సైతం ఎంపీలు ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
జమ్మూకాశ్మీర్, పంజాబ్ లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం, మాదక ద్రవ్యాలను సరఫరా చేయడంలో పాకిస్తాన్ చేసే ప్రయత్నాలను అడ్డుకుంటున్నామని, దీనిపై ఎంపీలు సైతం తోడ్పాటు అందించాలని ఆయన కోరారు.
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్ల పంజాబ్ లో అనేక సంవత్సరాలు భారీ నష్టం జరిగిందనే విషయాన్ని కొంతమంది ఎంపీలు లేవనెత్తారు. సరిహద్దు రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలను పంపడాన్ని యుద్ధచర్యగానే పంపాలని కూడా వారు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఆందోళనలు..
సరిహద్దు రాష్ట్రాలకు ముఖ్యంగా పాకిస్తాన్ చర్యల వల్ల తీవ్రంగా ప్రభావితమైన జిల్లాలకు మరిన్ని ప్రొత్సాహాకాలు ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు.
‘‘ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదం రూపాలు, వ్యక్తీకరణలను భారత్ జీరో టాలరెన్స్ విధానం గురించి అందరూ చర్చించారు. ఈ విషయంలో బలమైన, ఐక్య సందేశాన్ని పంపే ప్రాముఖ్యతను ఎంపీలు బలపరిచారు’’ అని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా సమావేశం చిత్రాలను ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆపరేషన్ సిందూర్ పై ఎంపీలకు ప్రజెంటేషన్ ఇవ్వగా, జైశంకర్ తరువాత ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇందులో విదేశాంగ శాఖ సహాయ మంత్రులు కీర్తివర్దన్ సింగ్, పబిత్రా మార్గెరిటా కూడా పాల్గొన్నారు.
అమెరికా, భారత్.. పాకిస్తాన్ తో ఎందుకు హైఫనేట్ చేసిందని కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారని, పాక్ కు ఐఎంఎఫ్ ఆర్థిక సాయం, భారత్ గైర్హాజర్ వంటి వాటిని సైతం లేవనెత్తారని ఆ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్- చైనా తో పెరుగుతున్న సంబంధాలపై కాంగ్రెస్ కూడా ఆందోళనలను లేవనెత్తిందని వారు తెలిపారు.


Tags:    

Similar News